Wednesday, January 22, 2025

ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరి వేసుకుంటా

- Advertisement -
- Advertisement -

ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరి వేసుకుంటా
రెజ్లర్ల ఆరోపణలై బ్రిజ్ భూషణ్ సవాలు
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందంటూ ఢిల్లీ పోలీసు ట్వీట్
ఆ వెంటనే తొలగించడంపై అనుమానాలు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ మహిళా రెజ్లర్లు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ తాజాగా మరోసారి కొట్టిపారేశారు.తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కదాన్ని నిరూపించినా తాను ఉరి వేసుకుంటానని ప్రకటించారు. మీదగ్గర ఏవైనా ఆధారాలుంటే వాటిని కోర్టుకు సమర్పించాలని, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని బ్రిజ్‌భూషణ్ మరోసారి స్పష్టం చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు బుధవారం ప్రకటించిన తరుణంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు ఆ ట్వీట్‌ను తొలగించడం చర్చకు దారి తీసింది.‘ ఇప్పటివరకు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదు.

మరో 15 రోజుల్లో చార్జిషీట్ లేదా తుది నివేదిక రూపంలో మేం కోర్టులో దర్యాప్తు వివరాలు సమర్పిస్తాం.అయితే రెజ్లర్ల ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్షాలు లభ్యం కాలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన పోక్సో చట్ట నిబంధనలకింద ఏడు సంవత్సరాలకంటే తక్కువ శిక్షఉంటుంది. అందుకే దర్యాప్తు అధికారి సదరు నిందితుడ్ని అరెస్టు చేయలేరు.అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సాక్షాలను ప్రభావితం చేయడం లేదు’ అని ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఉన్నత స్థాయి వర్గాలు చెప్పినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాల వెల్లడించాయి. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసు శాఖ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశం అయింది. ‘రెజ్లర్లు పెట్టిన కేసులో తుది నివేదిక ను సమర్పిస్తారంటూ కొన్ని సోషల్ మీడియాచానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే తగిన నివేదిక సమర్పిస్తాం’ అని బుధవారం మధ్యాహ్నం ట్వీట్ చేసిన ఢిల్లీ పోలీసు విభాగం ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను తొలగించింది.దీంతో బ్రిజ్ భూషణ్ కేసు వ్యవహారం గందరగోళంగా మారింది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఆదివారం కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ ప్రాంతంలో వారు మార్చ్ నిర్వహించడంతీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.అలాగే మంగళవారం గంగానదిలో తమ పతకాలను కలిపేస్తామని ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇక రెజ్లర్లకు మద్దతుగా గురువారం దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News