Wednesday, January 22, 2025

న్యాయం దక్కని రెజ్లర్లు

- Advertisement -
- Advertisement -

నాలుగు రోజుల క్రితమే ఎన్నికైన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని సస్పెండ్ చేయడం ఎన్నికల ఎత్తుగడా, కంటి తుడుపు చర్యా? ఇది అసలు దోషి పూర్వాధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తీసుకొన్న చర్య ఎలా అవుతుంది? ఈ సంస్థ చిరకాలంగా వివాదాల పుట్టగా మారి దేశ ఖ్యాతిని బలి తీసుకొంటున్నది. పార్లమెంటు సభ్యుడు (బిజెపి) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆడించినట్టెల్లా ఆడే కుక్కపిల్లలా మారి జాతి పరువును పలచబరిచింది.ఫెడరేషన్ అధ్యక్షుడుగా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ కూడా ఆయన జేబులోని మనిషే కావడంతో దానికి ఆవహించిన పీడ అనంతంగా సాగే దుస్థితి తలెత్తింది. బ్రిజ్‌భూషన్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు తెగబడ్డాడని, తగిన చర్యలు తీసుకోవాలని చిరకాలంగా ఆందోళన సాగుతున్నది. బిజెపి ప్రభుత్వం గాని, స్వయంగా ప్రధాని మోడీ గాని చీమ కుట్టినట్టయినా స్పందించలేదు. వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లను బ్రిజ్ బెదిరిస్తున్నాడని, డబ్బు ఇవ్వజూపి, వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాడని కూడా వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్ మోగా జిల్లాలో రాజకీయంగా విశేషమైన పట్టున్న బ్రిజ్ భూషణ్‌ను ఇంతకాలం బిజెపి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఫెడరేషన్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని, అధ్యక్ష స్థానంలో మహిళను నియమించాలని వగైరా డిమాండ్లను అంతర్జాతీయ పతకాలు గెలుచుకొన్న సీనియర్ రెజ్లర్లు స్వయంగా క్రీడల మంత్రిని కలుసుకొని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కొత్తగా ఎన్నికైన ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆ వెంటనే బ్రిజ్ భూషణ్‌తో చెట్టాపట్టా లేసుకొని దిగిన ఫోటోలను చూసి తమపై వేధింపులకు అంతం ఉండదని అర్ధమై మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ రంగం నుంచి తాను తప్పుకొంటున్నానని ప్రకటించారు. దీనితో ప్రఖ్యాత రెజ్లర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియా ఈ పరిస్థితులకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తన పద్మశ్రీ ని తిరిగి ఇచ్చి వేశారు. ఇందుకోసం మొన్న శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో ప్రధాని మోడీ నివాస భవనం వైపు వెళుతుండగా పోలీస్‌లు అడ్డుకొన్నారు. దానితో ఆయన తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని భవనం ముందరి దారి బాట మీద వుంచి వచ్చారు. ముగ్గురు మహిళా రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. వారి ఫిర్యాదులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసినందుకు సంతృప్తి చెంది మొత్తం ఎనిమిది మందికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది.

ఒక మైనర్ మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుకి సంబంధించి పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ వేసిన పోలీసులు ఆ తర్వాత దానిని వెనుకకు తీసుకోడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకొన్నారు. అందుకోసం మైనర్ రెజ్లర్ తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకొన్నారు. మూడు సార్లు ఫెడరేషన్ అధ్యక్షుడుగా చేసిన బ్రిజ్ భూషణ్ మరోసారి బరిలో ఉండనని తన అనుయాయులను కూడా ఎన్నికల్లో నిలబెట్టనని మాట ఇచ్చి అందుకు విరుద్ధంగా సంజయ్ సింగ్‌ను నిలబెట్టి అతడు ఎన్నికయ్యేటట్టు చూసుకొన్నాడు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెజ్లర్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక, అందులో బ్రిజ్ భూషణ్ నిరంకుశత్వం స్పష్టం కావడం బిజెపి పాలకులకు తలనొప్పిగా మారింది. నరేంద్ర మోడీ హ్యాట్రిక్‌ను సాధించడమే లక్ష్యంగా అన్ని రకాల పావులు కదుపుతున్న వేళ బజరంగ్ పునియా తన పద్మశ్రీ ని తిరిగి ఇచ్చేయడంతో కొత్త కార్యవర్గాన్ని సస్పెన్షన్‌లో వుంచక తప్పలేదు. మహిళా రెజ్లర్లు ఎంతగా మొరపెట్టుకొంటున్నా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎటువంటి చర్య తీసుకోకపోడం తమకు మేలు చేయదని ఘనత వహించిన కేంద్ర పాలకులు భావించి వుంటారు.

ఫెడరేషన్ కొత్త పాలక వర్గం నియమ నిబంధనలను ఉల్లంఘించి బ్రిజ్ భూషణ్‌కు ఎదురులేని గోండాలో జాతీయ పోటీలను ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకొని కార్యవర్గంపై వేటు వేశారు. ఈ చర్య తీసుకొన్న తర్వాత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను బ్రిజ్ భూషణ్ కలిశాడు. ఆ తర్వాత బ్రిజ్ మాట్లాడుతూ తనకు ఫెడరేషన్‌కు సంబంధం లేదని, లోక్‌సభ ఎన్నికలు తదితర బాధ్యతలు తనకున్నాయని ప్రకటించాడు. కొత్త కార్యవర్గాన్ని సస్పెండ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని కొందరు వాదిస్తున్నారు. అందుచేత కార్యవర్గ సస్పెన్షన్ కంటి తుడుపు చర్యగానే రుజువు కావొచ్చు. అధికారంలో వున్న వారితో ముఖ్యంగా ప్రధాని మోడీ వంటి వారి నాయకత్వంతో పోరాటం కొండను ఢీకొట్టడం వంటిదని మరోసారి రుజువు అయింది. ఎవరికి మొర పెట్టుకొన్నా ఫలితం పొందలేకపోయిన మహిళా రెజ్లర్లు అందరి సంఘీభావానికి అర్హులు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఇటువంటప్పుడు అనిపించడాన్ని ఆక్షేపించలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News