బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కాలప్ప బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ వెంటే నడిచిన కాలప్ప పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పనిభారం పెరిగినప్పటికీ ఇటీవలి కాలంలో తన పనితీరు అనాసక్తంగా, ఎటువంటి ఉత్సాహం లేకుండా సాగుతున్నట్లు తనకు కనిపిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో కాలప్ప పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో తనకు క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ న్యాయ సలహాదారు పదవితోసహా అనేక అవకాశాలు దయతో కల్పించినందుకు ఆయన సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. కాగా..ఇటీవల కర్నాటకలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో, రానున్న రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించనందుకు మనస్థాపం చెందే కాలప్ప రాజీనామా చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన త్వరలోనే ఆప్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.