కేంద్రంపై సిపిఎం నేత బృందాకారత్ మండిపాటు
హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే పార్టీ అధికారంలో ఉండాలనే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోం దని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఎద్దేవా చేశారు. కానీ యూపి, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీయే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడా కూడా అభివృద్ధి జరుగలేదన్నారు. పేద ప్రజల ఇండ్లపై బుల్డోజర్లను ఎక్కించడం సరికాదని మండిపడ్డారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నదన్నారు. మహబూబాబాద్‌లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుజాతరను ఆదివారం ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభిచారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో బృందాకారత్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరుపేదల సంక్షేమ కోసం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసే విధంగా బిజెపి పని చేస్తోందన్నారు. దేశంలో అనేక మంది ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని బృందా కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిరు పేదలకు వెంటనే ఇండ్లు కట్టించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. బిజెపి పాలనలో ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ వర్గ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
దేశంలో అమృత కాలం నడుస్తుందని ప్రధాని మోడీ అనడం సరి కాదని, పేద ప్రజలకు అమృత కాలం అంటే ఏమిటో వివరించి చెప్పాలన్నారు. కార్పొరేట్, పెట్టుబడి దారులకు అండగా ఉండి సామాన్యులను మరింత బలహీనులుగా చేసి దోచుకోవడం సరి కాదని బృందా కారత్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. దేశంలో ఉన్న కొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలపైన బిజెపి కావాలని దాడులు చేయిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక సార్లు తెలంగాణకు నిధులు తెచ్చానని ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు.
పేదలు పన్నుల రూపంలో చెల్లించినా కానీ కేంద్రం నిధులు కేటాయించడం లేదని, అభివృద్ధి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. దేశంలోని గిరిజనులు, ఆదివాసులు, మైనార్టీలు అందరూ కలిసి ఐక్యంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా తమ హక్కులను సాధించు కోవచ్చునని చెప్పారు. భారత రాజ్యాంగం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవించే హక్కును కల్పించిందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి రానున్న రోజుల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.