లండన్ : ఇజ్రాయెల్‌కు అండదండలు ప్రకటించిన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల సరసన బ్రిటన్ కూడా చేరింది. ఉత్తర లండన్ లో ప్రార్థనా మందిరంలో బ్రిటన్‌లోని యూదు సమాజంతో కలిసి సునాక్ సోమవారం ప్రార్థనలు చేశారు. ఆ తరువాత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్ లో సాగుతున్న యుధ్ధ పరిస్థితిపై చర్చంచారు. ఇజ్రాయెల్ లోని యూదు సమాజం భద్రతకు భరోసా ఇచ్చారు. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలోఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలతో కలిసి సునాక్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ సాగిస్తున్న భయంకర ఉగ్రవాద దాడులను ఏకగ్రీవంగా ఖండించాలని , ఇజ్రాయెల్‌కు సమైక్యంగా సంఘీభావం తెలియజేయాలని సునాక్ ప్రకటనలో పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్ధన కానీ చట్టబద్ధత కానీ ఉండదని పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా దేశాన్ని , ప్రజలను రక్షించుకోడానికి ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రయత్నాలకు మన దేశాలన్నీ మద్దతు అందించాలని కోరారు. అలాగే హమాస్ దాడులను స్వప్రయోజనాలకు వినియోగించుకుని ఇజ్రాయెల్‌పై శత్రుత్వం వహించడానికి ఏ దేశానికైనా ఇది సమయం కాదని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన సోమవారం సాయంత్రం విడుదలైంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను గుర్తిస్తాం
పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను తాము తప్పక గుర్తిస్తామని, ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లకు సమానంగా న్యాయం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులకు సమాన మద్దతు అందిస్తామని ఐదు దేశాల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో పొరపాటు చేయరాదని, ఆ ఆకాంక్షలకు హమాస్ సరైన ప్రాతినిధ్యం కాదని, పాలస్తీనా ప్రజలకు రక్తపాతం, ఉగ్రవాదం తప్ప హమాస్ ఏమీ చేయలేదని ఐదు దేశాల నేతలు తమ ప్రకటనలో సూచించారు. రానున్న రోజుల్లో ఇజ్రాయెల్‌కు తాము మిత్రదేశాలుగా కొనసాగుతామని, సమైక్యంగా సమన్వయంతో అండదండలు అందిస్తామని ప్రకటించారు.