Wednesday, January 22, 2025

సునాక్ సునామీ సృష్టించేనా?

- Advertisement -
- Advertisement -

ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతానని, ద్రవ్యోల్బణాన్ని సగానికైనా తగ్గిస్తానని, అక్రమ వలసలు నిరోధిస్తాన ని, ప్రజల మీద రుణ భారాన్ని కట్టడి చేస్తానని, జాతీయ ఆరోగ్య సేవల పథకంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తానని వంటి హామీలతో అధికారాన్ని చేపట్టిన రిషి సునాక్ సైతం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, కన్సర్వేటివ్ పార్టీకి అండగా ఉంటున్న ప్రజలను కూడా సంతృప్తి పరచలేక పోయారు. ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ లాంటి సిద్ధాంతాలతో పని చేస్తున్న మరో పార్టీ రిఫార్మ్ యునైటెడ్ కింగ్డమ్‌కి దినదినం ప్రజలలో ఆదరణ పెరుగుతున్నది. ఫలితంగా వారు సుమారు 15% ఓట్ల వాటను సృష్టించుకున్నారు.

ఒకప్పుడు అది రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన దేశం బ్రిటన్. ప్రపంచానికి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయినా పార్లమెంటరీ వ్యవస్థను ప్రపంచానికి అందించిన ప్రప్రథమ ప్రజాస్వామ్య దేశం. చైనా తర్వాత ఉభయ సభల (ఎగువ సభ లేదా హౌస్ ఆఫ్ లార్డ్‌లో 784 మంది సభ్యులు, దిగువ సభ లేదా హౌస్ ఆఫ్ కామన్స్‌లో 650 మంది సభ్యులు)లో కలిపి 1434 మంది సభ్యులతో రెండవ అతి పెద్ద శాసనసభ కలిగిన దేశం.ప్రపంచ భాషగా చలామణి అవుతున్న ఆంగ్ల భాషకు పుట్టినిల్లు ఈ దేశం. ఆంగ్లం రానిది అంగుళం కూడా కదలని పరిస్థితి నేడు. ఈ దేశ న్యాయశాస్త్ర చట్టాలు ఎన్నో దేశాల న్యాయ వ్యవస్థలకు ఆదర్శం. మొట్టమొదటి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినదేశం. ఇలాంటి దేశంలో ఎన్నికలంటే ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తుంది.

మన దేశంలో లాగానే పార్లమెంటులో రెండు సభలు (దిగువ సభ, ఎగువ సభ) ఉన్నాయి. దిగువ సభ సభ్యులను (హౌస్ ఆఫ్ కామన్స్) ప్రజలు ఎన్నుకుంటారు. బ్రిటన్‌లో పార్లమెంట్ ఏర్పడ్డ నాటి నుండి ఎన్నెన్నో రాజకీయ పార్టీలు వచ్చి పోయాయి. కానీ ప్రస్తుతం 13 రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా ఉన్నాయి.అందులో కన్జర్వేటివ్ పార్టీకి సుమారు 365 మంది, లేబర్ పార్టీకి 202 మంది, స్కాటిష్ నేషనల్ పార్టీకి 48 మంది, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి 11 మంది, చిన్నాచితక పార్టీలు, స్వతంత్రులకు కలిపి మిగతా 24 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం పెద్ద పార్టీ అయినా కన్జర్వేటివ్ పార్టీనుండి 12 మే 1980లో జన్మించిన భారత మూలాలున్న బిలియనీర్ రిషి సునాక్ తేదీ 25 -అక్టోబర్ -2022 నుండి బ్రిటన్ ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. రిషి సునాక్, భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధా నారాయణమూర్తిల కుమార్తె అక్షతమూర్తి భర్త.

గత 14 సంవత్సరాలుగా అధికారాన్ని చెలాయిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ మీద నానాటికీ బ్రిటన్ ప్రజలలో పెరిగిపోతున్న వ్యతిరేకతను గ్రహించిన ప్రధాని కింగ్ చార్లెస్ -3 ద్వారా పార్లమెంటును రద్దు చేయించారు. జులై 4, 2024న ఎన్నికలు జరగనున్నాయి. 2016 నుండి ఇప్పటివరకు జరిగిన ప్రధాన మంత్రుల మార్పిడులను గ్రహించినట్లయితే 2016లో డేవిడ్ కామెరున్ రాజీనామా చేయడంతో థెరిసామే ప్రధాన మంత్రి అయ్యారు. 2019 లో థెరిసామే రాజీనామా చేయడం చేత బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు. 2022లో బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం కారణంగా లిజ్ ట్రస్ ప్రధాన మంత్రి అయ్యారు. నెలన్నర (45 రోజులు) వ్యవధిలోనే లిజ్ ట్రస్ కూడా రాజీనామా చేయడం వలన 2022లోనే రిషి సునాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. భారత దేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించి ధన, మాన, ప్రాణాలను దోచుకొని భారతీయులను బానిసలుగా మార్చి పీల్చి పిప్పి చేశారు. వారి పరిపాలనలో స్వాతంత్యం కోసం జరిగిన పోరాటంలో లక్షల మంది భారతీయులు మరణించారు.

అటువంటి దేశానికి వలస వెళ్లిన భారతీయ సంతతి వ్యక్తి రిషి సునాక్ ఆ దేశాన్ని పరిపాలించడం చాలా సంతోషం. కానీ ప్రస్తుతం కన్జర్వేటివ్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ నుండి బయటకు రావడానికి బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుండి బయటికి రావడానికి జరిగిన ప్రజాభిప్రాయము లేదా రెఫరెండం)ఓపెన్ యూనియన్ నుండి బయటపడడం అప్పటి ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడం మాటిమాటికీ ప్రధానులు మారడం కన్జర్విటివ్ పార్టీలో సర్వసాధారణమైపోయింది. డేవిడ్ కామెరాన్‌తో మొదలుపెడితే రిషి సునాక్ వరకు 5 మంది ప్రధానులు మారారు. కేవలం 45 రోజులు మాత్రమే పరిపాలన చేసిన లిజ్‌ట్రస్ వల్ల పార్టీ బాగా బలహీన పడిందంటారు. సహజంగానే 14 ఏళ్లుగా పాలిస్తున్న పార్టీ మీద ప్రజలలో వ్యతిరేకత ఉండడం సహజమే.

ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతానని, ద్రవ్యోల్బణాన్ని సగానికైనా తగ్గిస్తానని, అక్రమ వలసలు నిరోధిస్తానని, ప్రజల మీద రుణ భారాన్ని కట్టడి చేస్తానని, జాతీయ ఆరోగ్య సేవల పథకంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తానని వంటి హామీలతో అధికారాన్ని చేపట్టిన రిషి సునాక్ సైతం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, కన్సర్వేటివ్ పార్టీకి అండగా ఉంటున్న ప్రజలను కూడా సంతృప్తి పరచలేకపోయారు. ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ లాంటి సిద్ధాంతాలతో పని చేస్తున్న మరో పార్టీ రిఫార్మ్ యునైటెడ్ కింగ్డమ్‌కి దినదినం ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. ఫలితంగా వారు సుమారు 15% ఓట్ల వాటను సృష్టించుకున్నారు. ముఖ్యంగా ఈ పార్టీ కన్జర్వేటివ్ పార్టీకి మద్దతుగా ఉన్న ఓటర్లనే తన వైపుకు తిప్పుకుంటుంది. దీనికి తోడు గడిచిన 5 సంవత్సరాలలో పన్నుల భారం ఎక్కువై బ్రిటిష్ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణించసాగాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, సర్వేల ఫలితాలను గ్రహించినట్లయితే 190 ఏండ్ల చరిత్ర కలిగిన కన్జర్వేటివ్ పార్టీ పక్షాన పని చేస్తున్న ప్రధాని రిషి సునాక్ అధికారంలోకి తెస్తారా లేక గద్దె దిగిపోతారా? అనేది పరిశీలిస్తే ప్రజల అభిప్రాయం మరోలా కనిపిస్తుంది.

గద్దె దిగడమే ఖాయమంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వానికి ఏడాది చివరి వరకు అవకాశం ఉన్నది. కానీ ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి ఎక్కువ కాకముందే లబ్ధి పొందాలని రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ కన్జర్వేటివ్ పార్టీకి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. కనీసం రిషి సునాక్ అయినా గెలుస్తాడా లేదా అనుమానాలు బలపడుతున్నాయి. అలా జరిగితే బ్రిటన్ చరిత్రలో తన స్థానంలో ఓడిపోయిన తొలి ప్రధానిగా మిగిలిపోతారు. భారత్ మూలాలున్న ఓటర్లు కూడా కన్జర్వేటివ్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు అంటున్నారు రాజకీయ ప్రముఖులు. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి సెప్టెంబర్ 2, 1963లో పేద వడ్రంగి కుటుంబంలో జన్మించి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన లెఫ్టీ లండన్ అనే పేరున్న 61 ఏళ్ల కైర్ రాడ్ని స్టార్మర్ నాయకత్వంలో ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రజలకు నమ్మకాన్ని కల్పిస్తున్నారు.

స్టార్మర్ బ్రిటన్‌లో పేరు మోసిన న్యాయవాది, 5 సంవత్సరాలు ఆ దేశానికి చీఫ్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. బ్రిటన్ రాజ కుటుంబానికి చేసిన న్యాయ సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారమైన ‘సర్’ అనే బిరుదు లభించింది. లేబర్ పార్టీకి 2019లో జరిగిన ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. కానీ నేడు జరగనున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి అధికారం చేపట్టబోతున్నదనేది అందరి విశ్లేషణ. అదే కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్ల తో ఓట్లతో 365 స్థానాలు సాధించింది. కానీ నేడు ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నదనేది సర్వేలు చెప్తున్నాయి. ఇంత వరకు కన్జర్వేటివ్ పార్టీ చేసిన తప్పిదాలను, ఇచ్చిన హామీలను సూటిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ, లేబర్ పార్టీ ఏమి చేయబోతున్నాం అనేది స్పష్టంగా ప్రకటిస్తూ, చాలా కాలం పాటు నిరుత్సాహంతో ఉన్న ప్రజలను ఉత్సాహపరుస్తూ పన్నులు పెంచకుండా , భారం లేకుండా చూస్తానని, బ్రిటన్‌లో నెలకొన్న ఇండ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తారని ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. భారతీయ మూలాలు ఉన్న ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిషి సునాక్ ప్రధాన మంత్రి కావడం ఖాయం. అలా జరిగితే భారతీయులందరికీ గర్వకారణమే. బ్రిటన్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో నమోదు చేసుకున్న ఓటర్లు 47,56,772. ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరిగి ఉండవచ్చు. ప్రపంచానికి పార్లమెంటరీ వ్యవస్థను అందించిన బ్రిటన్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది వేచిచూడాలి.

డా. కావలి చెన్నయ్య
9000481768

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News