లండన్ : భారత్కు వెళ్లే బ్రిటన్ జాతీయులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించింది. ఈ మేరకు ఇంతకు ముందటి అడ్వయిజరీని సవరిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. బ్రిటన్ జాతీయులు పదిరోజుల క్వారంటైన్లోకి వెళ్లాలని భారత ప్రభుత్వం ఒక్కరోజు క్రితమే ఆదేశాలు వెలువరించింది. బ్రిటన్ చర్యకు ప్రతిచర్యగా తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం అమలులోకి వస్తుంది. సంబంధిత విషయంపై తాము భారతీయ అధికారులతో మాట్లాడుతామని, ఈలోగా భారత్కు వెళ్లే విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని బ్రిటన్ వెలువరించిన తాజా మార్గదర్శకాలలో తెలిపారు. వ్యాక్సినేషన్లతో సంబంధం లేకుండా బ్రిటన్ నుంచి వచ్చే వారందరికీ క్వారంటైన్ తప్పనిసరి అని భారతదేశం తెలిపింది. భారతదేశం నుంచి బ్రిటన్కు వచ్చిన వారికి ఇదే విధమైన ఆంక్షలను అంతకు ముందు బ్రిటన్ ఖరారు చేయడం, ఇరు దేశాల మధ్య ప్రయాణ ఆంక్షల వివాదానికి దారితీసింది.