Friday, November 15, 2024

బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాబ్ తన మంత్రిత్వశాఖలోని సిబ్బందిపట్ల దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. దర్యాప్తు నివేదిక ప్రధాని రిషి సునాక్‌కు అందిన గంటల వ్యవధిలోనే రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్‌కు రాసిన లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. స్వతంత్ర దర్యాప్తును 49ఏళ్ల రాబ్ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్నారు.

అయితే దర్యాప్తులో ఏమి తేలినా తదుపరి చర్యలకు కట్టుబడి ఉంటానని లేఖలో పేర్కొన్నారు. కాగా రాబ్‌తో కలిసి పనిచేసే సివిల్ సర్వెంట్లపై ఆయన అనుచిత ప్రవర్తనపై ఆరోపణలు రాగా ప్రధాని సునాక్ స్పందించారు. సీనియర్ న్యాయవాది ఆడమ్ టోలీతో గత నవంబర్‌లో దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు నివేదికను టోలి ప్రధానికి అందించిన నేపథ్యంలో రాబ్ రాజీనామా చేశారు.

రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నివేదిక నిర్ధారిస్తే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. యూకె డిప్యూటీ పిఎంగా ఉన్న రాబ్ న్యాయ మంత్రిత్వశాఖకు రాజీనామా చేశారు. అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వ్యక్తిగత ప్రవర్తన కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసినవారిలో రాబ్ మూడో కీలక వ్యక్తి కావడం విశేషం.

టోలీ తన దర్యాప్తు నివేదికను గురువారం ఉదయమే సునాక్‌కు పంపించారనిప్రధాని అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ విలేఖరులతో మాట్లాడుతూ రాబ్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అయితే నివేదికను ఎప్పుడు పబ్లిష్ చేసేది చెప్పేందుకు సునాక్ నిరాకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News