బ్రిటన్ ఆర్థికమంత్రి సునాక్ దిద్దుబాటు
లండన్ : కొవిడ్ లాక్‌డౌన్ నియమావళిని ఉల్లంఘించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ క్షమాపణలు తెలిపారు. తాను పూర్తిస్థాయి అపాలజీని వ్యక్తం చేస్తున్నట్లు స్కాట్లాండ్ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఫైన్ కూడా జమచేసినట్లు తెలిపారు. ప్రధాని బోరిస్ జాన్సన్ జన్మదినం నేపథ్యంలో 2020 జూన్‌లో జరిగిన వేడుకకు ఈ మంత్రి హాజరయ్యారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ల దశలో సీనియర్ మంత్రి అయి ఉండి వీధులలో పార్టీలో చేరడం వివాదాస్పదం అయింది. లాక్‌డౌన్ల నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. స్థానిక డ్రౌనింగ్ స్ట్రీట్ , ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధాని జాన్సన్ బర్త్‌డే పేరిట విందులు వినోదాలు జరిగాయి. వీటిపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. తాను సారీ చెప్పినట్లు, ఫైన్ కట్టినట్లు ఈ భారతీయ సంతతి బ్రిటిషర్ అయిన మంత్రి వివరణ ఇచ్చారు. లాక్‌డౌన్ల దశలో ప్రముఖుల భారీ స్థాయి విందులు వినోదాల వ్యవహారం పార్టీగేట్ స్కామ్‌గా బ్రిటన్‌లో చలామణిలోకి వచ్చింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున దర్యాప్తుల తంతు జరుగుతోంది. జరిమానాలను ఖరారు చేసి విందులలో పాల్గొన్న జల్సారాయుళ్లకు వారి స్థాయిలను బట్టి పార్టీగేట్ ఫైన్‌లు విధిస్తున్నారు.