బ్రిటన్ రాజు చార్లెస్ వ్యక్తిగత పర్యటనపై బెంగళూరు వచ్చారని, ఆయన స్థానిక వైట్‌ఫీల్డ్ సమీపంలోని సువిశాల సమీకృత వైద్య కేంద్రంలో బస చేస్తున్నారని బుధవారం అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. రాజు చార్లెస్ నిరుడు మే 6న యునైటెడ్ కింగ్‌డమ్ రాజుగా పట్టాభిషిక్తుడైన తరువాత ఆయన నగరానికి రావడం ఇదే మొదటిసారి అని, ఆయన వెంట రాణి కమిల్లా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి.
‘తమ మూడు రోజుల పర్యటనలో ఆ దంపతులు బస చేసే కేంద్రం యోగా, ధ్యాన సెషన్లు సహా పునరుజ్జీవన చికిత్సకు పేరొందింది’ అని అధికారి ఒకరు తెలియజేశారు. ‘వారు ఈ వారం మధ్యలో తిరుగు ప్రయాణం అవుతారు’ అని ఆయన చెప్పారు. ‘వారు ఆ కేంద్రం చుట్లూ నడకను ఆస్వాదిస్తున్నారు, సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి వెళుతున్నారు’ అని ఆయన తెలిపారు. రాజు చార్లెస్‌కు ఇది 30 ఎకరాల ఆరోగ్య సేవ కేంద్రం సందర్శన మొదటిది కాదు. ఆయన 2019లో తన 71వ జన్మదినాన్ని ఇక్కడే జరుపుకున్నారు.