దేశ రాజధాని ఢిల్లీలోని మహిపాల్‌పుర్‌లో ఉన్న హోటల్‌లో ఓ బ్రిటిష్ మహిళపై అఘాయిత్యం జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విషయాన్ని బ్రిటిష్ హై కమిషన్‌కు తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఆ బ్రిటిస్ మహిళ ఇండియాకు నెల కిందటే వచ్చి మహారాష్ట్రలో బస చేసింది. తర్వాత గోవాకు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితుడైన కైలాష్(24)ను కలుసుకోడానికి ఆమె ఢిల్లీకి వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు. మొదట ఆమెను హోటల్ హౌస్‌కీపింగ్ స్టాఫ్ మానభంగం చేశాడు. తర్వాత హోటల్ రూమ్‌లో కైలాష్ కూడా ఆమెను బలాత్కరించాడని, వారిపై రెండు వేర్వేరు కేసులు నమోదుచేసినట్లు, డిప్యూటీ కమిషనర్(నైరుతి) సురేంద్ర చౌదరి తెలిపారు. ఆమె బుధవారం హాస్పిటల్‌లో చేరింది.
కాగా విషయాన్ని పోలీసులకు తెలుపడం జరిగిందని సమాచారం. తూర్పు ఢిల్లీకి చెందిన కైలాష్‌కు ఇంగ్లీషు పెద్దగా రాదు. అతడు ట్రాన్స్‌లేషన్ అప్లికేషన్ ఉపయోగించి ఆమెతో మాట్లాడాడు. ఆమె ఇండియాకు వచ్చాక ఢిల్లీలో కలుసుకునేట్లు ప్లాన్ చేశాడని పోలీస్ అధికారి వివరించారు. బాధితురాలు గోవా నుంచి ఢిల్లీ వచ్చి హోటల్ రూమ్ బుక్‌చేసుకుంది. హోటల్‌లో ఘటనలు ఏ క్రమంలో జరిగాయన్నది తెలుసుకునేందుకు పోలీసులు సిసిటివి ఫుటేజ్ చెక్ చేశారు. ఏసిపి నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు నిందితుడి నుంచి అతడి ఫోన్‌ను తీసుకున్నారు. అతడు సోషల్ మీడియా ద్వారా ఇంకా వేరే మహిళలకు కూడా ఎర వేశాడా అన్నది చెక్ చేస్తున్నారు.