పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ’బ్రో’. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తాజాగా విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ’వకీల్ సాబ్’, ’భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ’బ్రో’ భారీ వసూళ్లతో దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మా మావయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కృతఙ్ఞతలు. సముద్రఖని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. ముందుముందు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. బ్రో చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతఙ్ఞతలు”అని అన్నారు. నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడానికి ప్రధాన కారణం సముద్రఖని.
ఇంత మంచి సినిమాని త్రివిక్రమ్ తన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది”అని పేర్కొన్నారు. దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ.. “మేమందరం కలిసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాము. అందరూ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.ఎన్, శ్రీవాస్, చందు మొండేటి, మారుతి, బాబీ, గోపీచంద్, వివేక్ కూచిబొట్ల, కేతిక శర్మ, ఎస్.థమన్ తదితరులు పాల్గొన్నారు.