వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్‌ను ఇటీవలి వారాల్లో యుఎస్ ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలపై ఆధిపత్యం వహించనివ్వడం అనేక మంది అమెరికన్లలో భీతాహం సృష్టించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ, సిసలైన నమ్మకస్థుల చిన్న బృందం మద్దతు ఉన్న మస్క్ అమెరికాలోని విస్తృత ఫెడరల్ అధికారయంత్రాంగాన్ని విజయవంతంగా చేతుల్లోకి తీసుకున్నారు. మస్క్‌కు మరింత అధికారం ఇస్తూ ట్రంప్ మంగళవారం ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. తమ సిబ్బంది సంఖ్యను కుదించడంలోను, కొత్తవారి నియామకాలను పరిమితం చేయడంలోను మస్క్ ఆధ్వర్యంలోని ‘ప్రభుత్వ సామర్థ విభాగం (డిఒజిఇ డోగె)తో ఫెడరల్ సంస్థలు సహకరించాలని ఆ ఉత్తర్వు కోరుతోంది. ‘ప్రత్యేక’ ప్రభుత్వ ఉద్యోగిగా ట్రంప్ ప్రభుత్వంలో చేరిన తరువాత మీడియాతో మొదటిసారి మాట్లాడిన మస్క్ యుఎస్ ప్రభుత్వంపై తాను ‘ఆధిపత్యం’ వహిస్తున్నట్లుగా వినవస్తున్న విమర్శలకు స్పందించారు. భారీ ఎత్తున ప్రభుత్వ సంస్కరణ కోసం ప్రజలు వోటు వేశారని, ప్రజలకు అదే లభించబోతున్నదని ఆయన చెప్పారు.