Sunday, December 22, 2024

తెగిన నిజాం సాగర్‌ కాలువ కట్ట.. ఇండ్లలోకి చేరిన నీరు

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాం సాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాం సాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువ పక్కనే ఉన్న జర్నలిస్టు కాలనీ లోకి వరద నీరు వచ్చి చేరింది. మధ్య రాత్రి వేళ ఒక్కసారిగా నీరు ఇండ్ల లోకి రావడంతో కాలనీ వాసులు పరుగులు తీశారు. నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. అయితే కాలువ తెగి పోవడానికి ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజాం సాగర్‌ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. ఆర్మూర్ లో నీటి పారుదల అధికారులు కాలువను శుభ్రం చేయకపోవడంతో కట్టలు తెగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.  దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండి పోయింది. కాగా, ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News