Monday, December 23, 2024

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు నూకలు పార్శిల్

- Advertisement -
- Advertisement -

Broken rice parcel to Union Minister Piyush Goyal

మనతెలంగాణ/హైదరాబాద్ : మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అంటూ తెలంగాణను అవమానపర్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనకు టిఆర్‌ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీష్ రెడ్డి, టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు, టిఆర్‌ఎస్ నాయకులు నూకలు పార్సిల్ చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మా తెలంగాణ బిడ్డలను తినమన్న నూకలు కేంద్ర మంత్రికి పంపిస్తున్నాం, వాటిని ఆయన తింటాడో లేకపోతే దేనికైనా వాడుకుంటాడో ఆయన ఇష్టమని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడైనా రైతులు పంటలు పండక, సరైన ధర రాక ఇబ్బందులు పడుతుంటారని, కానీ, మన తెలంగాణ రైతులు పంటను కేంద్రం కొనకుండా ఇబ్బందులు పెడుతుందని ఆయన ఆరోపించారు.

రైతులకు కావాల్సిన అన్ని వసతులు నీళ్లు, కరెంట్, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు లాంటి పథకాలను రాష్ట్రప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. తెలంగాణ వడ్లను కొనుగోలు చెయ్యమని మంత్రుల బృందం ఢిల్లీకి పోతే ఆ పీయూష్ గోషల్ తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను కించపర్చే విధంగా మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండని ఉత్తరాధి అహంకారాన్ని వెళ్లగక్కారన్నారు. దేశంలో రైతులు పండించిన ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అందులో భాగంగా ఎఫ్‌సిఐలను పెట్టారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణకు ఉద్యమాలు కొత్తకాదు

తెలంగాణ జోలికి వచ్చి, తెలంగాణను కించపరిచే విధంగా నూకలు తినమన్న బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లినాయ్ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఉద్యమాలు కొత్తకాదు, పోరాటడం కొత్త కాదు, అది మా నెత్తురులోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో తెలంగాణతో గోక్కున్నోళ్లంతా ఏడున్నరో ఓసారి యాదీ తెచ్చుకోవాలని ఆయన హెచ్చరించారు. మరోసారి తెలంగాణ తిండిని ఎక్కిరిస్తే చీరి చింతకు కడ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సతీష్ యాదవ్, జగన్ మోహన్ రెడ్డి , వెంకట్ రెడ్డి, టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు షఫీ, టిఆర్‌ఎస్ సోషల్ మీడియా సైనికులు అక్షయ్, అనిల్ గౌడ్ , సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News