Saturday, January 18, 2025

గోధుమ రంగులో మంచు

- Advertisement -
- Advertisement -

మంచు తెల్లటి రంగులో ఉంటుందనేది అందరికీ విదితమే. కానీ, అమెరికాలోని మైనే రాష్ట్రం రమ్‌ఫోర్ట్ పట్టణంలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని ఒక ప్రాంతాన్ని గోధుమ వర్ణపు మంచు కప్పేసింది. ఆ అసాధారణ వాతావరణాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో గోధుమ రంగు మంచు పేరుకుపోయిందని పట్టణ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే, స్థానికంగా ఉన్న ఒక కాగితం మిల్లు సరిగ్గా పని చేయకపోవడమే ఆ పరిస్థితికి కారణమని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఇఐఎ) వెల్లడించింది. కాగితాన్ని ఉత్పత్తి చేసే ఆ కంపెనీ నుంచి వెలువడే ‘బ్లాక్ లిక్కర్’ అనే వ్యర్థ పదార్థమే అందుకు దారి తీసిందని యుఎస్‌ఇఐఎ వివరించింది.

కొన్ని నమూనాలు సేకరించి, పరిశీలించగా పిహెచ్ స్థాయి 10 కంటె ఎక్కువ చూపించిందని యుఎస్‌ఇఐఎ తెలియజేసింది. ఆ మంచును తాకవద్దని స్థానికులను అధికారులు హెచ్చరించారు. ఆ మంచు విషపూరితమైనది కాకపోయినప్పటికీ పెంపుడు జంతువులు, పిల్లలు అందులో ఆడుకోకుండా చూసుకోవాలని వారు సూచించారు. చర్మ సంబంధ సమస్యలు వస్తాయని వారు అప్రమత్తం చేశారు. ఆ తరువాత మైనే పర్యావరణ పరిరక్షణ విభాగం పరీక్షలు నిర్వహించగా పిహెచ్ స్థాయి 8 కంటె తక్కువగా నమోదు కావడంతో ఆందోళన తగ్గింది. బుధవారం వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆ మంచు కొట్టుకుపోవచ్చునని అధికారులు సూచించారు. కాగా, గోధుమ రంగు మంచు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News