Sunday, November 24, 2024

బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్

- Advertisement -
- Advertisement -

మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి ఏకమై కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి , రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సాయంత్రం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూర్ పట్టణంలో జరిగిన ప్రజాదీవెన బహిరంగ సభ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..‘మేము గేట్లు తెరి స్తే బిఆర్‌ఎస్‌లో ఆ నలుగురు తప్పా మిగతావాళ్ళు ఎవరూ ఉండరు. కారు ఖాళీ అవుతుంది’ అని సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చే స్తున్నామని, రానున్న ఎంపి ఎన్నికల్లో కాం గ్రెస్ 14 స్థానాల్లో గెలుస్తుందని గుర్తించిన బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్ర రా జకీయాలు చేస్తున్నాయని, ఇందుకు బిజెపి నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ రోజుకోసారి పా ర్లమెంట్ ఎన్నికల  తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని పదేపదే చేసే వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. అంతేగాక ఇరు పార్టీల కుట్రలో భాగంగానే బిజెపి ప్రకటించిన తొమ్మిది సీట్లలో బిఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలేదని, బిఆర్‌ఎస్ ప్రకటించిన నాలుగు సీట్లలో బిజెపి ప్రకటించలేదని ఆరోపించారు. అసలు బిజెపికి ఉన్న 8 మంది ఎంఎల్‌ఎలతో ఏవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అంటే బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మక్కై కుట్ర చేసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాయని ఆయన తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపిలు నామా నాగేశ్వర్ రావు, మాలోతు కవితలకు ఖమ్మం, మహబుబ్‌బాద్ టికెట్లను ఎందుకు ప్రకటించలేదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్, హరీశ్ రావు ఎంఎల్‌ఎలుగా ఉన్న మెదక్ లోక్‌సభ స్థానానికి ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదని, అక్కడ అభ్యరి దొరకడం లేదా అని సిఎం ప్రశ్నించారు. కెసిఆర్ కుమార్తె కవిత గతంలో పోటీ చేసిన నిజామాబాద్ నుంచి ఆమెను తిరిగి ఎందుకు పోటీ చేయించడం లేదని, ఆమెకు టికెట్ ఇవ్వరా లేదా అక్కడ ప్రజలు మరోసారి బండకేసి కొడతారని అనుమానమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటివరకు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారని, ఇప్పుడు ఆయనకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తారా లేదా తెలియజేయాలన్నారు. కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారనే భయంతో చీకట్లో ఒప్పందం చేసుకొని అలయ్ బలయ్ చేసుకొని మోడీ, కేడి కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌కి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల రక్షణ
బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తుండటంతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు మద్దతు ఇస్తామని తనతో చెబుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్ళు తాము బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నా గతంలో ఒక్క రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిని కలువలేదని, ఆయన తమ మాట వినలేదని, ఆయన ఎట్ల ఉన్నాడో కూడా తాము చూడలేదని తనతో వాపోతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రులు సచివాలయంలో ఉంటున్నార, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర, సచివాలయంలో పేదలు, కార్యకర్తలు,ఆ డబిడ్డలను కలుస్తున్నారని బి ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తనతో చెబుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికారులను కలుస్తూ, సమీక్షలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నందున అయిదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఘంటాపథంగా చెబుతున్నారని సిఎం అన్నారు. ఒకవేళ తాను గేట్లు తెరిస్తే కెసిఆర్, ఆయన కొడుకు, అల్లుడు తప్పితే బిఆర్‌ఎస్ నేతలంతా కాంగ్రెస్ జెండా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి , కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారని వ్యాఖ్యానించారు. భద్రాచలం ఎంఎల్‌ఎ డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తమకు మద్దతుగా నిలిచారని ఆయన చెప్పారు. తాము మార్యదపూర్వకంగా నైతికవిలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కెడిలు కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. తమకు లోతు, ఎత్తులు తెలుసునని, ఏం చేయాల్లో తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తాము అల్లాటప్పగా రాలేదని, నల్లమల్ల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టి కెసిఆర్ ను బజారుకు ఈడ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చామన్నారు. తమతో గోక్కోవద్దని, గొక్కొన్న వాడెవరూ బాగుపడలేదని హెచ్చరించారు. చాలా మంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎక్కడ ఉందన్నారని, మణుగూర్ వచ్చి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు.
బిఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి
బిఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని, హరీశ్ రావు, కెటిఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన తోడుదొంగలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ ఛార్లెస్ శోభరాజ్ అని, ఆయన పాపాలతో కాళేళ్వరం కూలిపోయి, మేడిగడ్డ మేడిపండై, అన్నారం పగిలిపోయి, సుందిళ్ళ దెబ్బతిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రారంభిస్తే బిఆర్‌ఎస్ ప్రభుత్వం సీతారామ, భక్తరాందాస్ ఎత్తిపోత్తల పథకం పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగడానికి నీళ్ళు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు వద్దు.. అవి డబ్బా ఇండ్లు ్ల అంటూ కెసిఆర్ భాష, యాసలతో ప్రజలను మోసగించారని, సూర్యుడు తూర్పున ఉదయించి, ప్రపంచానికి ఎలా వెలుగును ఇస్తాడో అలానే తెలంగాణకు, ఖమ్మం జిల్లా భద్రాచలం, మణుగూర్ తూర్పునే ఉంటుందని, అందుకే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని భద్రాచలంలో శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆశీర్వాదంతో ప్రారంభించామని సిఎం తెలిపారు. తాము మంచి చేస్తుంటే చూడబుద్దికాక తండ్రీ కొడుకులు, బిడ్డ, అల్లుడు శాపాలు పెడుతున్నారని, పిల్లిశాపాలకు ఉట్టి తెగిపడుతుందా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే తాము హామీలన్నీంటిని అమలు చేస్తున్నామని, బిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు పదేళ్ళలో అమలయ్యాయా అని కెటిఆర్ తన తండ్రి కెసిఆర్‌ను ప్రశ్నించాలని సిఎం సూచించారు. అధికారంలోకి వస్తే దళితుడే సిఎం, దళితులకు మూడేకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, గిరిజనులకు పోడు భూముల పట్టాలు, గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. తాము 90 రోజల వ్యవధిలోనే 30 వేల ఉద్యోగాలను ఇచ్చామని, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక, ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కనాడైనా కెసిఆర్, హరీశ్ రావు, కెటిఆర్ పరామర్శించారా అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మాట తప్పని, మడమ తిప్పని నేత సోనియా
ఈదేశంలో మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో కరీంగనర్ సభలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చారని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో అభయ హస్తం కింద ఆరు గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తున్నామని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్‌టిసి ఉచిత బస్సుల్లో ఇప్పటికే 24 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని, భద్రాచలం, యాదగిరి గుట్ట, సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఉచిత బస్సులో మహిళలు వెళ్ళి వస్తున్నారని ఆయన చెప్పారు. నేడు ముఖ్యమంత్రిగా మాట్లాడానికి ఖమ్మం జిల్లా నుంచి 1969లో పురుడు పోసుకున్న ఉద్యమమే కారణమన్నారు. ఖమ్మం జిల్లా ఎంతో చైతన్యవంతమైనదని, ఉమ్మడి జిల్లా ప్రజలు 2014, 2018, 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను నమ్మలేదని, ప్రతిసారి ఆ పార్టీకి ఒక్క సీటుకే పరిమితం చేశారన్నారు. గత మూడు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతున బొందపెట్టిన చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాదని ఆయన అన్నారు. కీలకమైన శాఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులకు అప్పగించామని, రెండు రాజ్యసభ సీట్లు వస్తే ఒక్కటి ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకాచౌదరికి సోనియా ఇచ్చారని, బలరాం నాయక్‌కు మహబుబ్‌బాద్ ఎంపి టికెట్ ఇచ్చామని, వీరిద్దరూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి వర్గంలో పనిచేశారని గుర్తు చేశారు. రానున్న ఎంపి ఎన్నికల్లో మహబుబ్ బాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌ను లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సిఎం పిలుపు ఇచ్చారు. ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ప్రసంగించగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, మహబుబ్ బాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, భద్రాచలం ఎంఎల్‌ఎ డాక్టర్ తెల్లం వెంకట్రావు, జారే అదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు విజయబాయి, తుళ్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News