మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ఖరీదైన పార్టీలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గడువు ముగియక ముందే మద్యం దరఖాస్తు పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యే టిక్కెట్ కు దరఖాస్తు చేసుకునే నేతల నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజలకు, సమాజానికి మంచి చేయాలనుకునే పేద, మధ్యతరగతి నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 99 వేల 999 రూపాయల వరకు మాఫీ అంటూ బంపర్ ఆఫర్ పెట్టింది. రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిన ప్రభుత్వం 99, 999 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తుండటం సిగ్గు చేటు. లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులు ఇంకా 20 లక్షల మంది ఉన్నారని, వారికి రుణమాఫీ వర్తింపజేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు.. ఇది ముమ్మాటికీ రైతులను మోసం చేయడమే. తక్షణమే ఆయా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.