అత్యధికంగా బీఆర్‌ఎస్-&తర్వాత స్థానాల్లో వైసీపీ, టీడీపీ –
2022 -23లో ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్లకుపైగా డొనేషన్లు-
అత్యధికంగా బీఆర్‌ఎస్‌కు రూ.154.03 కోట్లు –
వైఎస్సార్ సీపీకి రూ.16 కోట్లు, టీడీపీకి రూ.11.92 కోట్ల విరాళాలు-
నివేదిక విడుదల చేసిన ఏడీఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : విరాళాల సేకరణలో ప్రాంతీయ రాజకీయ పార్టీలు దూసుకుపోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటికి రూ.200 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయి. ఈ మేరకు వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను విడుదల చేసింది. విరాళాల సేకరణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), హరియాణాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచాయి.
మునుపటితో పోలిస్తే ఈ పార్టీలకు విరాళాలు గణనీయంగా పెరిగాయని ఏడీఆర్ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021-2022)తో పోలిస్తే జేఎంఎం విరాళాలు 3,685 శాతం, జేజేపీ విరాళాలు 1,997 శాతం, టీడీపీ విరాళాలు 1,795 శాతం మేర పెరిగాయి. ఇక ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ విరాళాలు 99.1 శాతం, శిరోమణి అకాలీ దళ్ విరాళాలు 89.1 శాతం తగ్గాయి. 28 ప్రాంతీయ పార్టీలకు 2,119 విరాళాల ద్వారా రూ.216.76 కోట్లు సమకూరాయని ఏడీఆర్ చెప్పింది.
బీఆర్‌ఎస్ నంబర్ 1 : అత్యధికంగా రూ.154.03 కోట్ల విరాళాలతో తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ జాబితాలో 1వ స్థానంలో నిలిచింది. 47 మంది దాతల నుంచి ఈ విరాళాలు బీఆర్‌ఎస్‌కు అందాయి. రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కేవలం ఐదుగురు దాతల నుంచి ఈ విరాళాలను వైఎస్‌ఆర్‌సీపీ సేకరించింది. టీడీపీకి రూ.11.92 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 90.56 శాతం బీఆర్‌ఎస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, డీఎంకేలకే దక్కింది. ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా(దాదాపు 78 శాతం) రూ.169.2 కోట్లు కార్పొరేట్, వ్యాపార సంస్థల నుంచే సమకూరాయి.
వ్యక్తిగత దాతల నుంచి రూ.45.24 కోట్ల విరాళాలు వచ్చాయి. 40 మంది కార్పొరేట్ దాతల నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి రూ.138.97 కోట్ల విరాళాలు అందాయి. ప్రాంతీయ పార్టీలకు అందిన విరాళాల్లో దాదాపు రూ.107.09 కోట్లు ఢిల్లీ కేంద్రంగా ఉండేే దాతల నుంచే వచ్చాయి. తర్వాతి స్థానాల్లో తెలంగాణ (రూ.62.99 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.8.39 కోట్లు) ఉన్నాయి. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో తమకు విరాళాలు అస్సలు రాలేదని బిజూ జనతాదళ్ (బీజేడీ), జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో కేవలం 0.099 శాతమే నగదు రూపంలో అందాయి. 43 మంది దాతలు రూ.21.45 లక్షలను నగదు రూపంలో పార్టీలకు విరాళం ఇచ్చారు. అత్యధికంగా కేరళలో రూ.9.09 లక్షల నగదు విరాళాలు, బెంగాల్‌లో రూ.5.91 లక్షల నగదు విరాళాలు వచ్చాయి.
ఆ విరాళాల వివరాలు లేవు : రాజకీయ పార్టీలకు రూ.20వేలకుపైగా చందాలను అందించే వారి వివరాలను తప్పకుండా వెల్లడించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. అయితే కొన్ని పార్టీలు తమకు విరాళాలను అందించిన దాతల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడంలో తీవ్ర జాప్యం చేశాయని తెలిపింది. 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 18 పార్టీలే తమ విరాళాల సమగ్ర సమాచారాన్ని నిర్దిష్ట గడువులోగా ఈసీకి అందించాయని పేర్కొంది.
ఈ వివరాలను 17 ప్రాంతీయ పార్టీలు కనిష్ఠంగా 2 రోజులు ఆలస్యంగా, గరిష్ఠంగా 164 రోజులు ఆలస్యంగా ఎన్నికల సంఘానికి అందించాయి. దాతల పాన్‌కార్డుల సమాచారాన్ని ఇవ్వకుండానే రూ.96.2 లక్షల విరాళాలను పొందినట్లు ఐదు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. ఈ పార్టీలకు వచ్చిన రూ.3.36 కోట్ల విరాళాలను అందించిన దాతల చిరునామా వివరాలను వెల్లడించలేదు. 204 మంది దాతల నుంచి వచ్చిన రూ.165.73 కోట్లు విలువైన చందాలను ఏ పద్ధతిలో పొందారనే వివరాలను కూడా బహిర్గతం చేయలేదు.