మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా బిఆర్‌ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడా ది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బిఆర్‌ఎస్ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో మే 4 (గురువారం)న అత్యంత అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉనికిలోకి రానుండటంతో బిఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతం కానున్నది.
బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించిన కార్యాలయంలోకి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగుపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఢిల్లీ బిఆర్‌ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అయితే ఈ పాటికే పలువురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హస్తిన బాట పట్టారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది.
ఢిల్లీలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ వివరాలు:
నాలుగు అంతస్తులతో, 11 వేల చదరపు అడుగుల స్థలంలో బిఆర్‌ఎస్ భవన్ నిర్మించబడింది.
లోయర్ గ్రౌండ్ లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ , రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లు నిర్మించారు.
మొదటి అంతస్తులో లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి.
2,3 వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు, వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.
సెప్టెంబర్ 2న భూమిపూజ చేసిన సిఎం కెసిఆర్
సెప్టెంబర్ 2, 2021న కార్యాలయ నిర్మాణానికి బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ భూమిపూజ చేశారు. అనంతరం నిర్మాణ పనులను బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. నిర్మాణం జరుగుతున్న సందర్భంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పలుమార్లు పనులను పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు చేశారు.