భారత్ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ స్థాయి లో అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేసి జాతీయ రాజకీయాల్లోక్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే. నిజానికి ఒక ప్రాంత సమస్యపై పోరాడేందుకు ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి, ఉద్యమ రాజకీయ పార్టీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సత్తాను చాటి, ప్రత్యేక రాష్ట్రం అనే తన లక్ష్యసాధనలో అలుపెరుగని పోరాటంతో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని అధికారానికి రావడమే కాక, మరో పర్యాయం కూడా నిలిచి గెలిచిన కీర్తి ఆ పార్టీకే సొంతం.
ఒక ఉపప్రాంతీయ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న తీరు రాజకీయ వ్యూహాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తీరు ఎవరూ మర్చిపోలేరు. దేశ రాజకీయాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఒక పేజీని సొంతం చేసుకున్న వాస్తవాన్ని ప్రత్యర్థి పార్టీలు సైతం ప్రశంసించిన సందర్భాన్ని కాదనలేము. మరి ఇంతటి చరిత్రతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తెలంగాణతో పెనవేసుకున్న బంధానికి గుర్తుగా ఉన్న తన పేరునే మార్చుకోవడం, జాతీయ స్థాయికి విస్తరించే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో రాజకీయంగా పోరాడేందుకు సమాయత్తం కావడం విశేషం. నాడు ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాడి సాధించిన స్ఫూర్తిని మళ్ళీ జాతీయ రాజకీయాల్లోనూ ప్రదర్శించాలనే కెసిఆర్ తెగువ రాజకీయ వర్గాల్లో ఆశక్తిని రేకిత్తిస్తున్నది.
జాతీయ రాజకీయాల్లో దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రత్యర్థి రాజకీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం తన ప్రభంజనాన్ని నిలుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో అస్థిరపడింది. తన మాట వినని రాజకీయ పార్టీలతోపాటు, ప్రాంతీయ పార్టీ ల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో బిజెపి అస్థిరపరుస్తున్నదని పలువురు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఢిల్లీలో సత్తాచాటేందుకు జాతీయ రాజకీయ పార్టీ ల్లో ఏ పార్టీ కూడా చెప్పుకోదగ్గ పరిస్థితుల్లో లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ ప్రత్యామ్నాయ కూటమికీ అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా తనకు తానే ఎదిగేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ పలురాష్ట్రాల్లో తన పార్టీల సభలను జరుపుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఆవిర్భావ సభను విజయవంతం చేసి ఒక్కసారి దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా చేయగలిగారు. అయితే ప్రాంతీయ పార్టీ విధివిధానాలకు, జాతీయ పార్టీ విధి విధానాలకు ఎంతో తేడా ఉంటుంది. రాష్ట్రాల మధ్య సమస్యలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, నదీ జలాల సమస్యలు వంటి వాటిపై తన వైఖరిని తేటతెల్లం చేయవలసిన బాధ్యత ఉంటుం ది. రాబోయే కాలంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు వేచిచూస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు మూలస్తంభాల వంటివి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించడం, అధికారంలోనికి రావడం, మరికొన్ని రాజకీయ పార్టీలు తెరమరుగు అవ్వడం జరిగింది.
రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన విధంగా ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉంటేనే అధికార పార్టీ మరింత బాధ్యతగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా బిఆర్‌ఎస్ అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమే. తెలంగాణ ప్రభుత్వంపైన అధికార పార్టీ నాయకులపైన బిజెపి చేస్తున్న దాడులను ఎదుర్కొంటూ వెనుకంజ వేయకుండా వారికి సవాలు విసురుతున్న కెసిఆర్ తెగువను ప్రశంసించక తప్పదు. ఇక తన పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరించేందుకు ఆయ న ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతారు అనేది చర్చనీయాంశమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు జరిగిన ఉద్యమం సందర్భంగా కెసిఆర్, ఆయన అనుచరులు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆంధ్రోళ్ళు అంటూ ఆయన అన్న మాటలు తాజాగా చర్చల్లోనికి వస్తున్నాయి. ప్రాంతీయ ఉద్యమాల్లో తన ప్రజలను ఉత్సాహపరిచి, సమైక్య పరిచేందుకు ఆయన ప్రయత్నించడంలో పెద్దగా తప్పుపట్టాల్సింది లేదు.
అదేసందర్భంలో లక్షలాదిగా హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్ర ప్రజలకు ఉద్యమ సందర్భంగా రక్షణ కల్పించడంలో ఉద్యమ నాయకునిగా ఆయన సఫలీకృతం అయ్యారు. సున్నితమైన తరుణంలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు నివారించగలిగారు. తన లక్ష్య సాధనకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చారు. హైదరాబాదులోనూ, తెలంగాణలోనూ కోట్లాది రూపాయల వ్యాపారాలను కలిగి ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు కించిత్ హాని కలుగలేదు. అంతేగాక ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఆయన బాసట గా నిలిచారు. ప్రభుత్వపరంగా వారి హక్కులను పరిరక్షించారు. అందుకే ఇక్కడ ఓటు హక్కు ఉన్న ఆంధ్రులు అన్ని ఎన్నికలలోను కెసిఆర్‌కే ఓట్లు వేశారు. వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇందుకు తార్కాణం.
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోను ఆయనకే మద్దతుగా నిలిచారు. ఆంధ్ర ప్రజల తమ విజ్ఞతను ప్రదర్శించారు. అంతేకాదు ఎపి రాజధాని అమరావతి భూమి పూజకు హాజరైన సందర్భంగా కెసిఆర్‌కు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ప్రధాని మోడీ పాల్గొన్న కెసిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడమేకాక సబికుల నుండి విశేష స్పందనను అందుకున్నారు తెలుగు ప్రజల మధ్య వైరుధ్యాలను అధిగమించేందుకు ఇటువంటి సంఘటనలు దోహదపడతాయి. దేశ రాజకీయాలలో కెసిఆర్ విసురుతున్న సవాలు బిజెపి పార్టీకి గట్టిగానే తాకుతుంది. ఇటువంటి సవాలును విసిరిన ప్రాంతీయ పార్టీ నేతగా ఆయన తన సత్తా చాటుకున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. సంకల్ప బలంతో ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రశంశనీయం. ప్రజా వ్యతిరేక విధానాలతో పలు వర్గాలను ఇబ్బందిపెడుతున్న మతతత్వ బిజెపిపై, లౌకిక ప్రజాస్వామ్యవాదంతో ముందుకు వెళుతున్న బిఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటాలని సగటు భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడు.
నేలపూడి స్టాలిన్ బాబు
8374669988