ఉత్తేజాన్ని నింపిన ప్రజా ఆశీర్వాద సభలు
విజయవంతంగా 96 సభలు పూర్తిచేసిన గులాబీ బాస్
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జన ప్రభంజనంతో విజయవంతమయ్యాయి. ఏ సభ చూసినా తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు,బిఆర్‌ఎస్ జిందాబాద్, కెసిఆర్ జిందాబాద్, కారుగుర్తుకే మన ఓటు అంటూ నినదించారు. ప్రజల హర్షాతిరేకాల నడుమ బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 96 ప్రజా ఆశీర్వాద సభలను పూర్తి చేశారు.
ప్రతి సభలో కళాకారుల ఆటపాటలు ఉర్రూతలూగించాయి. ఉత్తేజాన్ని నింపే ప్రసంగంతో ప్రజలను నిజానిజాలు తెలుసుకుని చర్చకు పెట్టాలని కెసిఆర్ ప్రతీ సభలోనూ సూచించారు. ప్రజాస్వామ్యంలో మరింత పరిణతి అవసరమని, ఎన్నికలొస్తే ఆగమాగం కావద్దని కెసిఆర్ పదేపదే చెబుతూ ప్రజలను సరైన దిశగా ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చేస్తూ వచ్చారు. ఒక పక్క బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు పరుస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణ దుర్భర పరిస్థితిని వివరించారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించిన అధినేత
తెలంగాణకు నష్టం తెచ్చిందే కాంగ్రెస్ అంటూ ప్రజలకు మరోసారి గుర్తుచేస్తూనే ..ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఉద్యమకారులను చంపిన విషయాన్ని కెసిఆర్ ప్రజల ముందుంచారు. అదేవిధంగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కాంగ్రెస్ మోసం చేసిన తీరును వివరించారు. దీనివల్ల జరిగిన బలిదానాలను చెప్పారు. కెసిఆర్ చచ్చుడో…. తెలంగాణ వచ్చుడో అంటూ దీక్షకు దిగిన సందర్బాన్ని గుర్తు చేశారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయం, పాలమూరు ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు ప్రజా ఆశీర్వాద సభల్లో కెసిఆర్ మరోసారి గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే 24 గంటలు కరెంటు ఉండదని, మూడు గంటలు కరెంటు చాలని పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ ప్రజలకు ప్రతి సభలలో వివరించారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని బట్టి విక్రమార్కతో పాటు రాహూల్ గాంధీ అన్న మాటలను పదేపదే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రస్తావించారు. 24 గంటలు కరెంటు ఉండాలా…? ధరణిని బంగాళాఖాతంలో కలుపాలా..? అని ప్రజలను ప్రశ్నిస్తే సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పడం గమనార్హం. అదేవిధంగా రైతుబంధు వేస్ట్ అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నాడని చెబుతూనే రైతుబంధు ఉండాలా…? వద్దా…? అని ప్రజలను ప్రశ్నించిన కెసిఆర్ ప్రజల నుండి ఉండాలనే సమాధానం రాబట్టారు. సంక్షేమ పథకాలపై ముఖ్యంగా పెన్షన్లపై ప్రజల నుంచి ఆమోదం పొందారు. ఈ రకంగా ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చే కష్టాలను వివరించారు.
32 రోజులు…96 ప్రజా ఆశీర్వాద సభలు
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజల్లో చైతన్యం వచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి అందులో పాల్గొని తమ అభ్యర్థిని, తమ పార్టీనీ గెలిపించాలని కోరారు. ముందుగా గత ఎన్నికల మాదిరిగానే హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అక్టోబర్ 15వ తేదీన పాల్గొని వరుసగా ఒక్కో రోజు రెండు నుంచి నాలుగు సభల్లో పాల్గొని ప్రజలకు అర్థమయ్యేలా ప్రసంగించారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ మొదటిది కాగా, వరుసగా 16న జనగాం, భువనగిరి 17న సిరిసిల్ల, సిద్ధిపేట 18న జడ్చర్ల, మేడ్చల్ 26న అచ్చంపేట, వనపర్తి. మునుగోడు 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ 31న హూజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల 5న కొత్తగూడెం, ఖమ్మం. 6న దేవరకొండ, గద్వాల, మక్తల్, నారాయణపేట, 7న చెన్నూర్, మంథని, పెద్దపల్లి. 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 9న గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో తన నామినేషన్ వేసిన కెసిఆర్ కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొని ప్రసంగించారు.
ఆ తర్వాత నవంబర్ 13న దమ్మపేట(అశ్వారావుపేట) ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొని అదేరోజు బూర్గంపాడు (భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు) ప్రజా ఆశీర్వాద సభతోపాటు నర్సంపేట జరిగిన సభలో పాల్గొన్నారు. మరుసటి రోజు పాలకుర్తి, హాలియా(నాగార్జునసాగర్), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్, ఎల్లరెడ్డి, మెదక్, నవంబర్ 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ , 17న కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల, 18న చేర్యాల(జనగాం), 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూర్, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్,పరిగి 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవేళ్ల, అంధోల్, సంగారెడ్డి చివరి రోజైన మంగళవారం(నవంబర్ 28)న వరంగల్(ఈస్ట్ అండ్ వెస్ట్) చివరిగా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభలు 96 విజయవంతంగా ముగిసాయి.. ప్రతి సభ జనసంద్రాన్ని తలిపించింది.