Monday, December 23, 2024

గులాబీ సైన్యం కదంతొక్కాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించేందుకు, పార్టీ కేడర్‌ను ఎన్నికలకు అన్నివిధాలుగా కార్యోన్ముఖులను చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. తొలిసారి నియోజకవర్గ స్థాయిలో జరగబోతున్న ఈ ప్రతినిధుల సభ వచ్చే ఎన్నికలకు ఒక శంఖారావం లాంటిదని పేర్కొన్నారు. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపడంతోపాటు.. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో.. పార్టీ అద్భుతమైన హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఈ సభల ద్వారా బలమైన పునాది వేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనతోపాటు, బిజెపి అన్యాయాలు, మోసాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహణ వచ్చేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, తొమ్మిదేళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణాన్ని సభలలో సమగ్రంగా చర్చించేలా ప్రసంగాలు, రాజకీయ తీర్మాణాలు ఉండాలని వెల్లడించారు.

ఈ నెల 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగే నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధుల సభ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నాయకులకు సలహాలు, సూచనలను చేశారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3 వేల నుంచి 3,500 మంది కార్యకర్తలతో ఈ పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానించాలని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా అత్యంత కీలకమైన దాదాపు నాలుగు లక్షల మంది పార్టీ నాయకులను ఇందులో మమేకం చేయాలని సూచించారు. 25వ తేదీన జరిగే సభ ద్వారా వారికి ప్రతి కీలక విషయంపైన పూర్తి అవగాహన కల్పించడం ద్వారా ఆయా అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

తీర్మానాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రధానంగా ఆరు తీర్మానాల ద్వారా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే బిజెపి తెలంగాణకు అడుగడుగునా ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రజలకు వివరించేలా తీర్మానాలు చేయాలని కెటిఆర్ సూచించారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బిజెపి వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని చెప్పారు. వీటితోపాటు వివిధ అంశాలపైన సమయాన్ని బట్టి తీర్మానాలు చేసుకోవచ్చని సూచించారు. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి అసాధారణమైనదని, యావత్ దేశానికే తెలంగాణ వ్యవసాయ విధానం అదర్శంగా నిలుస్తున్న విషయాన్ని తీర్మానాల్లో ప్రస్థావించాలని తెలిపారు.

అలాగే కాళేశ్వరం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగంలో సాధించిన విప్లవం, మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవం పోసిన మహాయజ్ఞంపై పార్టీ శ్రేణులతో మాట్లాడించాలని దిశానిర్ధేశం చేశారు. కరెంట్ చార్జీల కోతలు, చార్జీల వాతలతో దేశంలోని అన్నదాత కుదేలవుతుంటే.. తెలంగాణ రైతు దర్జాగా 24 గంటల ఉచిత విద్యుత్ అందుకుంటున్న అపూర్వ సందర్భాన్ని వివరించాలని కోరారు. దేశానికి వెన్నుముక రైతన్న అయితే.. ఆ రైతుకు వెన్నుముకగా కెసిఆర్ నిలిచిన విషయాన్ని ప్రతినిధుల సభా వేదికపై చర్చించాలని సూచించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు ఆలోచించని విధంగా సిఎం కెసిఆర్ అమలుచేసిన రైతుబంధు, రైతు భీమాపై కూడా పార్టీ సమావేశంలో తీర్మానాలు చేయాలని చెప్పారు.

బిజెపి అన్నదాతలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో చర్చించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి రైతాంగ సంక్షేమానికి పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వ మాత్రం నల్ల చట్టాలు తెచ్చి దేశంలోని రైతుల నోట్లో మట్టికొట్టే కుట్ర చేసిందని మండిపడ్డారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతులు కష్టించి పండించిన ధాన్యం కొనకుండా ఏ విధంగా బిజెపి అన్నదాతలకు అన్యాయం చేస్తుందో కూడా సభలో చర్చించాలని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి, సామాజిక భద్రతకు చేపట్టిన కార్యక్రమాల పైన మరొక తీర్మాణం ప్రవేశపెట్టి చర్చించాలని కెటిఆర్ సూచించారు. ఇందులో భాగంగా పసిపిల్ల వాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ అందుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాల పైన ప్రత్యేకంగా చర్చ చేయాలని తెలిపారు. మహిళా సంక్షేమం, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, వికలాంగులకు సంక్షేమ కార్యక్రమాలు ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపైన, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపైనే ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం ఉండాలని పేర్కొన్నారు. అలాగే విద్యారంగం ఉపాధి , అనే అంశం పైన మూడో రాజకీయ తీర్మానాన్ని చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కెటిఆర్ సూచించారు.

ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రసంగాలు ఉండాలని సూచించారు. గురుకుల పాఠశాలల ద్వారా ప్రతి విద్యార్థి పైన 1,25,000 రూపాయలను ఖర్చు చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని పార్టీ వేదికపై ఆవిష్కరించాలని కోరారు. పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ప్రారంభించుకొని వాటిని జూనియర్ కాలేజీలు, డీగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న తీరుపైన విస్తృతమైన చర్చ చేయాలన్నారు. దీంతోపాటు ఉపాధి రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక వైపు టిఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చిన ఉపాధి అవకాశాలపైన ప్రత్యేకంగా చర్చ చేయాలన్నారు.

ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తీరుపై ప్రత్యేకంగా చర్చ జరగాలి

ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. దాదాపు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తీరుపైన కూడా ప్రత్యేకంగా ప్రస్థావన చేయాలని కెటిఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనన్ని నియామకాలు చేపడుతుంటే.. కొందరు పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ప్రగతి కోసం అనేక కార్యకలాపాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వకుండా తెలంగాణ పైన ప్రత్యేకంగా వివక్ష చూపిస్తున్నది, ముఖ్యంగా మెడికల్ , నర్సింగ్ కాలేజీలు, ఐఐయం, గిరిజన యూనివర్సిటీ వంటి ఉన్నత విద్య సంస్థల ఏర్పాటు వంటి అంశాల్లో అడుగడుగునా చూపిస్తున్న వివక్షపైన కూడా ఈ రాజకీయ తీర్మానం సందర్భంగా ప్రత్యేకంగా ఎండగట్టాలని సూచించారు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటిచ్చారని, ఆ హామీ మేరకు 18 కోట్ల ఉద్యోగాలు కల్పించి ఉంటే రాష్ట్రంలో బిజెపి నిరుద్యోగ మార్చ్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ప్రతినిధుల సభలో తీర్మానాల ద్వారా బిజెపిని గట్టిగా నిలదీయాలని, రాష్ట్రంలోని యువతకు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా చర్చించాలని కోరారు.

పట్టణాలు, పల్లెల్లో సాధించిన సమగ్ర ప్రగతి నాలుగో తీర్మానం

నాలుగవ రాజకీయ తీర్మానంగా పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి ద్వారా అటు పట్టణాలు ఇటు పల్లెల్లో సాధించిన సమగ్ర ప్రగతి పైన విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై చర్చించడం ద్వారా ఈ సరికొత్త అభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకతపై సభలో తీర్మానాలు చేయాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ పనితనం ఎలాంటిదో చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే నిదర్శనమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఒకప్పుడు దగాపడ్డ పల్లెలు ఇప్పుడు ప్రగతికి చిరునామాగా మారాయని, పట్టణాలు వెలుగురేఖలతో ఎలా విరాజిల్లుతున్నాయో ప్రజలకు గుర్తుచేయాలన్నారు.

ఐదో తీర్మానంగా బిజెపి వైఫల్యాలను ఎండగట్టాలి

ఐదో రాజకీయ తీర్మానంగా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు. మండిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏవిధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో రాజకీయ తీర్మానంలో ప్రస్థావించాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. దేశంలో పెట్రో ముడిచమురు ధరలు తగ్గుతున్నా, మోడీ చమురు ధరలు మాత్రం పెరిగిపోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చర్చించాలన్నారు. దేశప్రజల జేబుల్లో నుంచి ఏకంగా 30 లక్షల కోట్లను దోచుకుని దోస్తుల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని పార్టీ వేదికలపై ఎండగట్టాలని కోరారు. మోదీ హయాంలో పప్పు పిరం, ఉప్పు పిరం, గ్యాస్ పిరం, గ్యాస్ పై వేసిన దోశ పిరం అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని ఇప్పటికే ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం బిఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో ప్రతిబింబించేలా తీర్మానాన్ని రూపొందించాలని కోరారు.

జిల్లాలకు కీలకమైన స్ధానిక అంశాలపై ఆరో రాజకీయ తీర్మానం

రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసిఆర్ కడుపులో పెట్టి చూసుకుంటుంటే మోదీ మాత్రం పిరమైన ప్రధానిగా మారిపోయారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రియమైన ముఖ్యమంత్రి కావాలా.. లేక పిరమైన ప్రధాని కావాలో ప్రతి ఒక్కరు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని గుర్తుచేయాలన్నారు. ధరలను నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టే కుట్ర జరుగుతోందని, అందుకే దీనిపై ప్రజలకు పూర్తి స్పష్టతనిచ్చేలా తీర్మానం ఉండాలన్నారు. దీంతోపాటు నియోజకవర్గాలు, జిల్లాలకు అత్యంత కీలకమైన స్ధానిక అంశాలపైన ఆరో రాజకీయ తీర్మానం రూపొందించుకోవాలని కెటిఆర్ సూచించారు. ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టిన అంశాలు, విభజన హామీలు, స్దానిక ప్రజలు చేస్తున్న డిమాండ్ల పట్ల బిజెపి వ్యవహరిస్తున్న వివక్షపూరిత వైఖరి వంటి అంశాలు ఈ రాజకీయ తీర్మానాలలో స్పష్టంగా ఉండాలన్నారు.

మహబూబ్ నగర్ కు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేయడం, ఖమ్మం జిల్లాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చకపోవడం , వరంగల్ జిల్లాకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ , గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీసీఐ , నిజామాబాద్ కి సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు వంటి కీలక హామీలను నెరవేర్చకుండా బీజేపీ చూపిస్తున్న వివక్షపై రాజకీయ తీర్మానాలు చేసి విస్తృతంగా చర్చించాలన్నారు. దీంతోపాటు నియోజకవర్గాల వారీగా కేంద్ర ప్రభుత్వం గతంలో హామీలను (ఉదాహరణకు సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్, నారాయణపేటకు హ్యాండ్ లూం పార్కు ఏర్పాటు, మునుగోడులో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భువనగిరిలో ఎయిమ్స్ కార్యకలాపాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు) నెరవేర్చకపోవడంపట్ల కేంద్రంలోని బిజెపిపై స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై తీర్మానాలు చేయాలని కోరారు. వీటితోపాటు స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంపై కూడా తీర్మానం చేయాలన్నారు. ఏ పాలకుడు ఆలోచించని విధంగా తెలంగాణలో అమలుచేస్తున్న దళితబంధు దేశం దృష్టిని ఆకర్షిస్తోందనే విషయాన్ని కూడా ప్రతినిధుల సభలో చర్చించాలన్నారు. రాష్ట్ర అత్యున్నత పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకోవడం రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమర్పిస్తున్న సమ్మునత గౌరవం అనే విషయాన్ని కూడా పార్టీ వేదికపై ఘనంగా చర్చించుకోవాలని కోరారు.

జాతీయ పార్టీగా అవతరించడంపై చర్చించాలి
ఉద్యమ పార్టీగా మొదలైన టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ గా రూపాంతరం చెందడం, జాతీయ పార్టీగా అవతరించడం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని పార్టీ వేదికపై చర్చించి ప్రజలకు వివరించాలని కెటిఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న అపారమైన విజన్ దేశానికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందో పార్టీ ప్రతినిధుల వేదికపై చర్చిచాలన్నారు. దేశానికి విజన్ ఉన్న నాయకత్వం కావాలి తప్ప, ప్రతిరోజు టెలివిజన్‌లో ప్రత్యక్షమై ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే నాయకత్వం కాదనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించేలా తీర్మానం చేయాలని కోరారు. కెసిఆర్ అంటే సంక్షేమం, మోదీ అంటే సంక్షోభంగా ప్రజలు భావిస్తున్న అంశాన్ని పార్టీ ప్రతినిధుల సభలో తీర్మానించడంతోపాటు.. వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చేసేలా సభలను నిర్వహించాలని కోరారు. అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న బిఆర్‌ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని, ఈ ప్రతినిధుల సభలను పెద్దఎత్తున విజయవంతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల సమరానికి బలమైన పునాది వేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News