Friday, January 31, 2025

ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి బిఆర్‌ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. జిహెచ్‌ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా..? అని ప్రశ్నించారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు

తమ ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా…? అని అడిగారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్‌ఎంసి అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన కార్పొరేటర్‌లను,బిఆర్‌ఎస్ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కెటిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News