హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ నాయకులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇక పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా ప్రచారంలోకి దిగనున్నారు. 17 రోజుల్లో 42 సభలతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేశారు.
అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ఈ బస్సు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈ బస్సును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. దీంతో అది కొన్నిరోజుల క్రితమే యూపీ నుంచి రాష్ట్రానికి చేరింది. ఈ బస్సు ఆదివారం నుంచి మొదలయ్యే కెసిఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై పరుగులు పెట్టనుంది.