Thursday, December 26, 2024

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్ ఫోకస్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం
కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను
ఎగురవేసేలా ఇప్పటి నుంచే సన్నద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నారు. మరికొన్ని రోజులలో కెసిఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎలాంటి వారిని బరిలో దింపాలి అనే అంశాలపై కెసిఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం.
పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు త్వరలో జిల్లాలవారీగా బిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు, కృతజ్ఞత సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహం పనిచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కెటిఆర్, హరీశ్‌రావులతో పాటు పలువురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరును సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేసిన విధంగా రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియానే విసృతంగా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.
గ్రేటర్‌పై స్పెషల్ ఫోకర్
రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికల్లో హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితికి విజయధుంధుబి మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న పట్టు సడలకుండా బిఆర్‌ఎస్ అధిష్టానం గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. బిఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ పట్టు నిలుపుకునేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ నాయకులను సన్నద్ధం చేయడంలో భాగంగా ఇటీవల కెటిఆర్ గ్రేటర్ బిఆర్‌ఎస్ కార్పోరేటర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని ఆ సమావేశంలో కెటిఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీఅ ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన బిఆర్‌ఎస్ ఒత్తిడి తీసుకువస్తుందని వెల్లడించారు. జిహెచ్‌ఎంసిలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమం కోసమే పనిచేస్తుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఎంపి టికెట్ల కోసం నేతల ప్రయత్నాలు
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలువురు మాజీ ఎంఎల్‌ఎలు, సీనియర్ నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాము ఎంపి టికెట్ రేస్‌లో ఉన్నామని, తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని, పలువురు నేతలు స్థానిక నేతలతో చెప్పుకుంటూ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News