Monday, December 23, 2024

తెలంగాణ ముందే ఓటు వేసిందా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నామినేషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారినా, ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ నియోజక వర్గానికి, ఏ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసు కాబట్టి ప్రచారం ముమ్మరం సాగుతుంది రాబోయే వారం రోజులు. అందరికన్నా ముందుగాని తన అభ్యర్థులను ప్రకటించి ఒక స్పష్టమైన ప్రణాళికతో బిఆర్‌ఎస్ పార్టీ మిగతా పార్టీలకన్నా ప్రచారంలో బాగా ముందుకు సాగిపోతున్న వైనం చూస్తున్నాము. అయితే టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ పార్టీలోనే గాక క్రమశిక్షణ గల పార్టీ అని గొప్పలు చెప్పుకునే బిజెపిలో కూడా చాలా గందరగోళం నెలకొంది. ఒకరి పేరు ముందు ప్రకటించడం, చివరి నిమిషంలో మరొకరిపేరు ఖరారు చెయ్యటంతో కార్యకర్తల్లో అయోమయం చోటు చేసుకుంది. ముందు టికెట్ పొంది ఆ తరువాత పోగొట్టుకున్న వ్యక్తి గమ్ముగా వుండడుకదా! అందరూ అద్దంకి దయాకర్ అంత పెద్ద మనుషులుగా వుండరుకదా రాజకీయాల్లో! అద్దంకి దయాకర్ పేరును ముందు ప్రకటించి తరవాత మార్చలేదు. అది వేరు విషయం. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారు సహజంగానే ఒక్కో స్థానానికి కనీసం ముగ్గురు నలుగురు సీరియస్ అభ్యర్థులు వుంటారు. ఇటువంటి పరిస్థితి సామాన్యంగా కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకునే వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఆ పార్టీలో. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. జాతీయ పార్టీలలో చాలా మంది నేతల ప్రమేయం ఉంటుంది టికెట్ పంపిణీలో. ఆశావహులు వారికున్న పరిచయాలు, పరపతి, వనరులను బట్టి తలా ఒక కేంద్ర నాయకుడి ద్వారా ప్రయత్నం చేసుకుంటారు ఢిల్లీలో. నేడు ఈ పైరవీల సంస్కృతి బిజెపికి కూడా పాకింది. మామూలుగా బిజెపిలో టికెట్ ఆశించేవారు తక్కువ. పార్టీ ఆదేశిస్తే పోటీ చెయ్యటమేగానీ టికెట్ కావాలని పట్టుపట్టే విధానం ఒరిజినల్ బిజెపిలో లేదు. ఎవరినిబడితే వారిని పార్టీలో చేర్చుకోవడం వలన వచ్చింది ఈ పరిస్థితి. అందుకే బిజెపిలోకి వలస వచ్చిన నేతలు ఎంతో మంది ఇతర పార్టీలలోకి వలస వెళ్తున్నారు.చిత్రం ఏంటంటే చేరికల కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చైర్మన్ ఎవరో, ఏ పార్టీలో చేరారో ఈ గందరగోళంలో తెలియకుండా వున్నది. ఎవరైనా ఇష్టపడి పార్టీలో చేరతాం అంటే సరేకానీ, చేరికల కమిటీని ఏర్పాటు చేసి చేపలను పట్టినట్లు వలవేసి ఎవరు చేరుతారో అని ఎదురు చూడటం బిజెపి విధానం కానేకాదు. ఎవరినిబడితే వారిని చేర్చుకోవటమే బిజెపి కష్టాలకు కారణం.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వెళ్లిపోయాడు. పోరాటాల చైర్మన్ పోరాటం చేస్తూ పార్టీని వీడారు. డికె అరుణ పోటీ చెయ్యడం లేదు. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చాడు. వేములవాడ అభ్యర్థి ఉమ లేదు. సంగారెడ్డికి ముందు ప్రకటించిన దేశ్ పాండే పార్టీని వీడాడు.వీడే ముందు టికెట్ విషయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా! బాబూ మోహన్ లేడు. రేపు ఎన్నికల అనంతరం ఈటల రాజేందర్ ఉంటారని భరోసా లేదు. రాజేందర్ పోయి పోయి కెసిఆర్ మీద పోటీ చేస్తున్నారు తన నియోజకవర్గాన్ని వదిలేసి. ఓడిపోయినాక ఏమి చేస్తాడు ఐదు ఏళ్ళు? వచ్చే ఏడాది జరిగే లోక్‌సభకు పోటీ చెయ్యొచ్చు కానీ ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ లోక్‌సభకు పోటీ చెయ్యటం మాటలు కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, కిషన్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాడు, కేంద్రంలో మంత్రి అయ్యాడు, నిజమే! కానీ చరిత్ర పునరావృతమవుతుందని చెప్పలేం కదా. పైగా రాజేందర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం లేదు. ఆ నేపథ్యంలేని వాళ్ళు బిజెపిలోకి అతిథులుగా వస్తుంటారు, పోతుంటారు.

 

వారిని బిజెపి కూడా సీరియస్‌గా తీసుకోదన్నది తెలిసిన విషయమే. అసలు సమస్యకు కారణం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిచిన బిజెపి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు సీట్లు గెలవటమే. వాపును బలుపు అనుకున్నట్లు ఆ నాలుగు సీట్ల గెలుపు చూసి తెలంగాణలో పాగా వెయ్యటానికి అవకాశం ఉందని భ్రమపడి గట్టి ప్రయత్నమే చేసింది. అయితే బండి సంజయ్ అతివాదం పార్టీకి హాని చేసేదిగా ఉందని ఆలస్యంగా తెలుసుకుంది. బండి సంజయ్‌ని మార్చినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం తెలంగాణలో జరపటం లాంటి కంటి తుడుపు చర్యలు పార్టీని ప్రజలకు చేరువ చెయ్యలేకపోయింది. 117లో కనీసం 7 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేని బిజెపి తాము గెలిస్తే బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం ఉత్తర కుమార ప్రగల్భాలుగా అనిపిస్తున్నవి సగాటు మనిషికి. వేములవాడ నుంచి ముందు ప్రకటించిన బిసి మహిళ అభ్యర్థి తులా ఉమను కాదని పార్టీలో క్రియాశీలకంగాలేని వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వటం చూస్తే బిజెపికి బిసిల మీద ఏమాత్రం అభిమానం వున్నదో తెలిసిపోయింది. పైగా వారసత్వం గురించి ప్రవచనాలు చెబుతారు!

రేవంత రెడ్డి తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. కామారెడ్డిలో ఓడినా కొడంగల్‌లో గెలిచే అవకాశం కొట్టివేయలేము. అయితే ఈటల రాజేందర్ కామారెడ్డిలో పోటీ చెయ్యటం అర్ధంలేని చర్య. కేజ్రీవాల్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో మోడీ మీద వారణాసిలో పోటీ చేశారు. ఏమి సాధించారు? డిపాజిట్ గల్లంతయింది. బిసికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బిజెపి వేములవాడలో బిజెపికి చెందిన బిసి మహిళకి ఇచ్చిన మర్యాదను ఎవరూ మర్చిపోరు. అసలు బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించటమే హాస్యాస్పదం. మొదలు లేదు మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్లుంది బిజెపి వ్యవహారం. బిసికి చెందిన ఒక్క అభ్యర్థి అయినా గెలుస్తాడనేది అనుమానమే. గెలిచే అవకాశం వున్న రాజేందర్ ను కామారెడ్డిలో పోటీకి పెట్టడంతో బహుశా బిజెపి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యే సత్తా వున్న బిసి అభ్యర్ధాలు ఎవరూ మిగిలి లేరు. క్రితంసారి కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మెట్రోమాన్ శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది బిజెపి. అయితే అక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవకపోవటం గమనార్హం.

తెలంగాణ బిజెపిలో చివరకు మిగిలేది కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ అని కొందరికి అనిపిస్తుంది. ఇది తెలంగాణకు శుభ పరిణామంగానే భావించాలి.
ఇహ కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక నిర్దిష్టమైన, విశ్వశనీయమైన విధానం లేదు. ఎన్నికల్లో గెలవటానికి వ్యూహాల కన్నా ప్రజల విశ్వాసం పొందడం ప్రధానం. టిడిపి పోటీ నుంచి తప్పుకుంది కాంగ్రెస్‌కు మేలు చెయ్యటం కోసమే అనే ప్రచారం జోరుగా సాగుతుంది. టిడిపి పోటీలో లేదు గనక ఆ పార్టీ ఓటు కాంగ్రెస్‌కు పోతుంది అనటానికి ఆధారాలు ఏమీ లేవు. పైగా తెరమరుగైన వలసవాదాన్ని ఒక సామాజిక వర్గం మళ్ళీ తెర మీదకు తేవడం వివాదాస్పదమైంది. ఈ వాదంలో ప్రధానమైన బలహీనత ఆంధ్ర మూలాలుండి తెలంగాణలో స్థిరపడిన వారందరూ ఒకే సామాజిక వర్గానికే చెందిన వారనుకోవడం! ఆంధ్ర నుంచి వలస వచ్చినవారు అనేక సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. వారంతా ఒకే విధంగా ఓటు వేస్తారనుకోవడానికి ఆధారాలులేవు. వలసదారులకు సంఘాలు లేవు, వేదికలు లేవు. అనేక ప్రాంతాలు అనేక సామాజిక, ఆర్ధిక నేపథ్యాలున్నవారు ఉపాధి అన్వేషణలో హైదరాబాద్ వచ్చారు.

ఇక్కడ స్థిరపడ్డారు. రాజకీయ అవకాశాల అన్వేషణ అధికారం కోసం ఆరాటపడటం వారికి సంబంధం లేని అంశం. బలంగా వున్నవారి వైపే మొగ్గు చూపుతారు. ఇక్కడ కులం పని చేయదు. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రావాసుల్లో కొందరే స్థితిమంతులు. స్థితిమంతులైన వారి వాణి, వారి బాణి వేరు. అది కొద్దిమందికే వర్తిస్తుంది. జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వారికి రాజకీయ ఆకాంక్షలు లేవు. ఒక వర్గానికి వున్న ఆకాంక్షను అందరికీ ఆపాదించటం అర్ధరహితం. పైగా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పే ఆ వర్గం మీద ఇతర వర్గాలకు వున్న వ్యతిరేకతను విస్మరించరాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి కాంగ్రెస్ హస్తం లేదనలేం. కానీ 2004లో రాష్ట్రపతి పార్లమెంటునుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రత్యేక రాష్ట్ర అంశం పదేళ్లు సాగదీసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. అధికారంలో వున్న బిఆర్‌ఎస్ పార్టీ ఈ పదేళ్లలో ఏమి చేసిందో చెప్పగలుగుతున్నది.

రానున్న ఐదేళ్ళలో ఏమి చేస్తాము అనేది కూడా స్పష్టంగా చెప్పగలుగుతున్నది. ప్రజలకు ఈ స్పష్టత వున్నది. చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చారు స్వల్ప మార్పులు మినహా. అక్కడక్కడ వున్న అసంతృప్తులను పార్టీ నాయకత్వం బుజ్జగించింది. దాంతో అందరు దారిలోకి వచ్చారు. ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు పోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కి ఒక బలమైన ప్రచార అస్త్రం లేదనే అభిప్రాయం కొంత మందిలో వుంది. లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తి, గవర్నరు పాత్ర లాంటి అంశాల మీద దృష్టి పెడితే బాగుండేది అనుకునేవారు లేకపోలేదు. ఒక నిర్దిష్టమైన నేరేటివ్ లేకపోవటం కనిపిస్తున్నది. చివరికి, సర్వేలు, యూ ట్యూబ్ చానెళ్లు ఏమి చెబుతున్నప్పటికీ ఏ పార్టీతో సంబంధం లేని తటస్థ ఓటర్లు కెసిఆర్ గెలుపుకి ఏమీ ఇబ్బంది లేదన్న గట్టి అభిప్రాయానికొచ్చారు. పార్కుల్లో, రైల్వేస్టేషన్‌లలో, బస్సు స్టాండ్‌లలో ప్రజల నాడిని గమనించే వారికి ఈ విషయంలో స్పష్టత వచ్చింది.

ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని కాదు, కానీ అది ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయిలో లేదు. బిజెపి పోటీలో లేదు. టిడిపి వెనక నుంచి చక్రం తిప్పాలని చూస్తుంది. కాంగ్రెస్‌లో ఎప్పటిలాగే నాయకులు ఎక్కువ, అభిమానులు తక్కువ. ఈ పరిస్థితిలో తటస్థులు కెసిఆర్ వైపు మళ్ళుతున్నట్లు తెలుస్తుంది నిశితంగా ప్రజల నాడిని పరిశీలించేవారికి. దీని అర్ధం తెలంగాణ ప్రజలు పోలింగ్‌కు ముందే విషయం తేల్చేశారా? పార్టీలతో ప్రమేయంలేని పరిశీలకులకు అలాగే అనిపిస్తుంది మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News