Sunday, December 22, 2024

అదిరేలా ఆవిర్భావోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తృతంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం చేపట్టనుంది. ఈ విషయాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని కెటిఆర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిఆర్‌ఎస్ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు.. అక్టోబరు 10వ తేదీన వరంగల్లో బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది.

నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు ఈ నెల 25న నిర్వహించాలనికెటిఆర్ తెలిపా రు. ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జీలు, స్థానిక ఎంఎల్‌ఎల అధ్యక్షతన కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల సమయానికి నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు. 25న రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరుగుతుందని అన్నారు.

సంక్షేమ, పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ..

ఆయా సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ విస్తృతంగా చర్చించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2,500 నుంచి -3 వేల మందితో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటిసిలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, జెడ్‌పి చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌ఎలు,ఎంఎల్‌సిలు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. వీరందరినీ సమావేశాలకు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎంఎల్‌ఎలు, పార్టీ ఇంఛార్జ్‌లలను పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు కెటిఆర్ తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎంఎల్‌ఎలు, ఇంఛార్జ్‌లకు కెటిఆర్ సూచించారు.

27న కేంద్ర కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం

పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈ నెల 27న బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. అదే రోజున తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని అన్నారు. సమావేశంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఆ రోజు ఉదయం పార్టీ అధినేత కెసిఆర్ పార్టీ జెండాను ఎగుర వేసి, సమావేశాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ, విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10న భారత రాష్ట్ర సమితి వరంగల్‌లో మహాసభను నిర్వహించనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు.

శ్రేణులకు అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై అధినేత కెసిఆర్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు వరకు కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించినట్లు చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్‌కు నంద కిశోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపి మాలోతు కవితను నియమించారని తెలిపారు. ముగ్గురు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారని కెటిఆర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News