Friday, December 20, 2024

గత ప్రభుత్వం పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కొంది

- Advertisement -
- Advertisement -

లే ఔట్‌లు చేసి వేలం వేసి అమ్ముకుంది
10 వేల ఎకరాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టింది
ఎస్సీ, ఎస్టీల గురించి బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరం
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

మనతెలంగాణ/హైదరాబాద్: గత ప్రభుత్వం పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కొని లే ఔట్‌లు చేసి వేలం వేసి అమ్ముకుందని, గత ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహారించారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము గత ప్రభుత్వం మాదిరిగా ఎక్కడా బలవంతంగా భూములు లాక్కోవడం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 10 వేల ఎకరాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల గురించి బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూములు తీసుకుంటామని నిర్వాసితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి భట్టి విక్రమార్క ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్కో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా మన్నారు. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా బిఆర్‌ఎస్ అభివృద్ధి చేయలేదు కాబట్టి మిగతా వారు కూడా అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇంకా భ్రమల్లో ఉంటే అది వారి ఖర్మ అని ఆయన అన్నారు.

కెసిఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరు ఒక్కటే…

కెసిఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరు ఒక్కటేనని, అందుకే తమ పాలనపై కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు ఊహల్లో బ్రతుకుతున్నారని విమర్శిస్తున్నారని తమ ప్రభుత్వం చేసిన పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసనీ ఆయన అన్నారు. అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. భూములు కోల్పోతున్న వారి బాధను అర్ధం చేసుకొని కాంగ్రెస్ 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చిందన్నారు. లగచర్లలో కొద్దిమంది కావాలని కుట్ర పూరితంగా అమాయక ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతిక దాడి చేయించారని ఆయన ఆరోపించారు.

ఇందిర చరిత్రను వక్రీకరిస్తున్నారు…

దేశ సమక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ కృషి చేశారని గతం తెలియని వారు, దేశాభిమానం లేని వారు ఇందిర చరిత్రను వక్రీకరిస్తున్నారని భట్టి మండిపడ్డారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని ఆయన గుర్తు చేశారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ స్పూర్తితో మహిళలకు పథకాలు అందజేస్తామన్నారు. వరంగల్ లో ఇందిరా మహిళా శక్తిని చాటి చెబుతామన్నారు. దేశ ప్రజలకు సమానత్వం కల్పించాలని భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభర ణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజానికి పునాదులు వేసిన ప్రధాని ఇందిరాగాంధీ విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకొచ్చా రన్నారు.

రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని నిర్ణయించారన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన సర్వేను ప్రారంభించామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. కులగణన సర్వే పూర్తి తర్వాత ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌లో దేశానికి ఈ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండబోతుందన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తుందన్నారు. అసెంబ్లీ లో ప్రమాణం చేసిన గంటలోపే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏడాదికి 20వేల కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తున్నామని ఆయన తెలిపారు. వడ్డీ లేని రుణాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దునుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News