- భూపాలపల్లిలో వర్గాలు లేవు
- భూపాలపల్లిని మరోసారి అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలి
- భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి కలెక్టరేట్: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని, భూపాలపల్లిలో ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గెలిపించాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లిలోని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించామని ప్రజలను కోరుకుంటున్నానన్నారు. గతంలో కుగ్రామంగా ఉన్న భూపాలపల్లిని గత ఎంఎల్‌ఏ సిరికొండ మధుసూదనాచారి హయాంలో ప్రస్తుత నా హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌ల సహాకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచుతున్నామన్నారు. మరో మారు అవకాశం కల్పించాలని మీడియా ముఖ్యంగా ప్రజలను కోరుతున్నానని, భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి కేంద్ర, మాజీ సభాపతిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. నా ఎన్నికకు వారి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
మనందరిది ఒకే కుటుంబం, మన నాయకుడు కెసిఆర్ అన్నారు. కెసిఆర్‌ను మూడవ సారి ముఖ్యమంత్రి చేయడంలో కలిసి నడుద్దామని, ఏవేవో కలలు కంటున్న నాయకులకు తగిన గుణపాఠం చెపుతామన్నారు. మా పార్టీ నాయకులకు, కార్యకర్తల సహకారం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి తీరుతామన్నారు. మూడవ సారి 100 పై చిలుకు సీట్లతో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, డబల్ ఇంజన్ సర్కార్‌లను వెనక్కి నెట్టి బుల్లెట్ స్పీడ్‌తో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నా వ్యక్తిత్వం గురించి అందరికి తెలుసని ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తామని, తర్వాత ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసి పనిచేసే తత్వం తనదని అన్నారు.
ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర మీడియాకు ఉందని, నా గెలుపుకు మీడియా సహకారం ఉండాలని కోరారు. భూపాలపల్లిలో వర్గం అంటూ లేదని, చాలా మంది బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాత కొత్త అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా కలుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలులో విభేదాలు లేకుండా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏకకాలంలో 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడం గొప్ప విషయమని, రానున్న రోజుల్లో 100 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చేసిన అభివృద్దే మారోమారు బిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఒక గొప్ప నగరంగా ప్రసిద్ది చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న ఎన్నికలలో భారీ మెజారిటీతో భూపాలపల్లిలో విజయకేతనం ఎగురవేసి తీరుతామని, సెప్టెంబర్ 8వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్‌పి కార్యాలయం, మెడికల్ ప్రారంభం, మంజూర్‌నగర్‌లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, పట్టణాధ్యక్షుడు కటకం జనార్థన్, మేకల సంపత్, కౌన్సిలర్లు పిల్లల నారాయణ, ముంజాల రవీందర్ గౌడ్, జక్కం రవి, నూనె రాజు, మేకల రజిత మల్లేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సంబరాలు చేసుకున్న బిఆర్‌ఎస్ నాయకులు
త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి నియోజకవర్గ ఎంఎల్‌ఏ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డిని ప్రకటించిన సందర్భంగా గణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ చౌరస్తా నుండి భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంబరాలలో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.