Saturday, November 16, 2024

వందశాతం పనులు పూర్తి చేస్తేనే బిఆర్‌ఎస్‌కు 100 సీట్లలో అవకాశం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 % పూర్తిగా అమలు చేసినపుడే బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఆదరించి 100 సీట్లలో అవకాశం ఇస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, వాటిని ఈ ఎన్నికల ముందే అమలు చేసి, చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు.

అప్పుడే ప్రజలు నమ్మి, మళ్లీ అధికారి ఇస్తారని అన్నారు. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని ఆరోపించారు. ఇంకా 13700 కోట్లు రుణమాఫీ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి, పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసారు. అలా చేసినప్పడే రైతులు ఈ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

యాసంగి సీజన్‌లో ధాన్యం అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 11 లక్షల ఎకరాలకు పోడు భూములకు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కాని నేటి వరకు అది అమలు కావడం లేదని చెప్పారు. వెంటనే పోడు పత్రాలు ఇచ్చిన ఆరైతులకు అన్ని రకాల రాయితీలు కల్పించాలని కోరారు. ధరణిలో ఉన్న లోపాలను సరిచేయాలని కోరారు.

ఎడమ కాలువ ఆధునీకరణ పనుల్లో ఆయా మేజర్ల పరిధిలోని లైనింగ్ పనులు మద్యమద్యలో వదిలేశారని, వర్షాకాల సీజన్ ప్రారంభం కాకముందే లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, రెమిడాల పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, వినోద్‌నాయక్, జతంగి సైదులు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News