Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష
కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేస్తూ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం పక్కా అని పేర్కొన్నారు. కెసిఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. మూడోసారి కెసిఆర్‌ను గెలిపించాలని, అభివృద్ధిని కొనసాగిద్దామంటూ హరీశ్‌రావు ఓటర్లకు, ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరేనని, బిజెపికి ఒక్క చోట కూడా డిపాజిట్ రాదని విమర్శించారు. షెడ్యూల్ వచ్చిందని పొలిటికల్ టూరిస్టులు వస్తారని, వారితో అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాళ్లు ఇచ్చే ఉత్తుత్తి హామీలు నమ్మొద్దని కోరారు. ప్రజలు ప్రతి అవసరాలను, ఆకాంక్షలను గుర్తించి వాటిని బిఆర్‌ఎస్ నెరవేరుస్తున్నదని స్పష్టం చేశారు. కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలని, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బిఆర్‌ఎస్ మెనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుంది
బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను సిఎం కెసిఆర్ ఈ నెల 15న ప్రజల ముందు ఉంచుతారని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా మెనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బిఆర్‌ఎస్ మెనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ మాట ఇచ్చాడంటే నెరవేర్చుతారనే నమ్మకం ప్రజల్లో ఉన్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు.. తెలంగాణ పుట్టుకనే జీర్ణించుకోలేని బిజెపి మరోవైపు ఉన్నాయని.. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న బిఆర్‌ఎస్ ఓ వైపు ఉన్నాయని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల మోటర్లకు కరెంటు మీటర్లు పెడుతున్న బిజెపి పార్టీలు ఒక వైపు అనీ పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ విశ్వసనీయత ఒక వైపు అన్నారు. బిజెపి విద్వేష ప్రచారం, కాంగ్రెస్ విషప్రచారం ఇంకో వైపు అని అన్నారు. రూ.200 మించి పింఛన్ ఇయ్యలేని కాంగ్రెస్ ఇప్పుడు ఆరు హామీలంటూ కొత్త డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కర్ణాటకలో విచ్చలవిడి అవినీతితో బిజెపి అధికారం కోల్పోతే.. నమ్మి ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వంద రోజుల్లోనే కాంగ్రెస్ బొక్క బోర్లాపడ్డదని విమర్శించారు. రాష్ట్రాలను అంధకారంలో ముంచడంలో….అధికారం కోసం ఎంతకైనా దిగజారడంలో పోటీ పడుతున్న ఆ రెండు పార్టీలు తెలంగాణను దోచుకోవడానికి దండెతుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గాలి మాటలను, మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని.. ప్రజలు వాస్తవాలు గ్రహించేలా నేతలు, కార్యకర్తలు వివరించి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News