Wednesday, January 22, 2025

5లక్షల మందితో ‘అదిరిపోవాలి’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టిం ది. బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగే మొట్ట మొదటి బహిరంగ సభ కావడంతో సభా ప్రాంగణం దద్దరిల్లాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తునారు. ఈ సభను దేశ రాజధానిలో ఏర్పాటు చేయాలని మొదట కెసిఆర్ భావించారు. అయితే మారుతున్న రాజకీయా తె లంగాణ నుంచే బిఆర్‌ఎస్ గర్జనను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రకంపన లు సృష్టించాలని కెసిఆర్ భావిస్తున్నారు. మేరకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, పార్టీ నేతలతో సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. ఈ బహిరంగ సభ ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో ఏర్పాట్లు జరగాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సభకు ఢి ల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్, కేరళ సిఎం పినరాయి విజయన్, యుపి మాజీ సిఎం, స మాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాద వ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మరికొందరు జాతీయస్థాయి నేతలు హాజరు కానున్నారని జిల్లా నేతలకు కెసిఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో… పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపే విధంగా సభ జరగాలన్నారు. దీంతో భారీ ఎత్తున జన సమీకరణ జరగాలని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించారు.

ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి బహిరంగ సభకు జనాలను తరలించాలని ఆయన ఆదేశించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన కెసిఆర్ ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. ఈ సభ ద్వారా దేశ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పులను వివరించబోతున్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపిలు నామానాగేశ్వర్‌రావు, రవిచంద్ర, పార్థసారథి, శాసనసభ్యులు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎంఎల్‌సి మధు, జెడ్‌పి చైర్మన్ కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

దేశానికి చక్కటి సందేశం

భారీ సభతో దేశానికి చక్కటి సందేశం ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందని… రైతు సంక్షేమం, బిఆర్‌ఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై యావత్ ప్రజలకు కెసిఆర్ సందేశాన్ని ఇవ్వనున్నారు. పైగా ఖమ్మం జిల్లా ఎపికి సరిహద్దుగా ఉండటం కూడా సభ కోసం ఈ జిల్లాను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఆ జిల్లాలో సభ ద్వారా పక్క రాష్ట్రం ప్రజలకు కూడా కెసిఆర్ తన సందేశాన్ని వినిపించనున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆవశ్యకత, రైతులకు చేయబోయే కార్యక్రమాల ఎజెండాను రైతుల ఎదుట వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎపిలో బిఆర్‌ఎస్‌కు అనూహ్య ఆదరణ లభిస్తున్నది. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది నేతలు ఎపిలోకి బిఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రావెల కిశోర్‌బాబు వంటి చాలామంది సీనియర్ నేతలు ఇప్పటికే బిఆర్‌ఎస్‌లో చేరారు. మరికొందరు చేరేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఇక బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను ఇప్పటికే కెసిఆర్ నియమించిన విషయం తెలిసిందే.

పార్టీ సత్తాను చాటేలా….

సిఎం కెసిఆర్ చెప్పినట్టుగానే సంక్రాంతి పండుగ తర్వాత బిఆర్‌ఎస్ ధూమ్‌ధామ్ మొదలు కానున్నది. రైతు, రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మంలో ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా బిఆర్‌ఎస్ తన శంఖారావం పూరించనున్నది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. తెలంగాణ ఉద్యమానికి, టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బిఆర్‌ఎస్ కూడా బహిరంగ సభ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సత్తా చాటేలా బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు.

సభలతో అవినాభావ సంబంధం

టిఆర్‌ఎస్ (ప్రస్తుత బిఆర్‌ఎస్)కు, బహిరంగ సభలకు అవినాభావ సంబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో, పార్టీన ప్రజలకు చేరువ చేయడంలో గతంలో నిర్వహించిన పలు సభలు కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా 2001 ఏప్రిల్ 27న టిఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభ, 2003లో వరంగల్‌లో నిర్వహించిన సభ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాయి. బహిరంగ సభలను కెసిఆర్ కేవలం బలప్రదర్శనకు కాకుండా తన సందేశాన్ని ప్రజలకు బలంగా వినిపించేందుకు వేదికగా చేసుకున్నారు. ఇప్పుడు ఖమ్మంలో నిర్వహించే సభను కూడా కెసిఆర్ అదే తరహాలో వినియోగించుకోనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News