ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశాం
25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్లు రుణమాఫీ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ / హైదరాబాద్: రైతులకు రెండు లక్షల రుణమాఫీ విషయంలో బిఆర్‌ఎస్ నాయకులు కపటప్రేమ ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి ప్రభుత్వం రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబంధతను చాటుకున్నది. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రూ.20,616.89 కోట్లు రుణమాఫీ చేసి, 25,35,964 మంది రైతులను రుణవిముక్తులని చేసింది.
గత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో రైతన్నల పట్ల వివక్షత ప్రదర్శించిందనేందుకు అనేక ఉదంతాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు పలు సందర్భాల్లో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ్త ఆర్థిక పరిస్థితులు అస్తవ్యసంగా ఉన్నప్పటికి ప్రజాపాలన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని,దేశ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా సాహసోపేత నిర్ణయం తీసుకొని, ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నింటిని మొదటి పంటకాలంలోనే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన పేర్కొన్నారు.
మొదటి మూడు విడతలలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చేందుకు వీలుగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి, మూడు నెలల పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించారని, చివరి విడతలో 3,13,896 మంది రైతులకు రూ.2,747.67 కోట్లు రుణమాఫీ చేసి, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని తెలిపారు. రుణమాఫీ గురించి, ఈ ప్రభుత్వం గురించి అర్థం, పర్థంలేని విమర్శలు చేసే బిఆర్‌ఎస్ నాయకులు రెండు పర్యాయలు ప్రణాళిక లేకుండా చేసిన రుణమాఫీ, నిష్ప్రయోజనమైన తీరుని తెలంగాణ సమాజం గమనించారన్న విషయం మరిచి మాట్లాడుతున్నారు.
బిఆర్‌ఎస్ నయవంచన
రైతుల రుణాల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల హామీ ఇచ్చి బిఆర్‌ఎస్ వంచనకు గురిచేసిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. లక్ష వరకు రుణమాఫీ కోసం నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీది అని ఆయన తెలిపారు. దీనికి కూడా విడతల వారిగా జమ చేయడం వలన రైతులపై రూ.2,630 కోట్లు అధిక వడ్డీ భారం పడిందని వివరించారు. 2014 రుణమాఫీ వల్ల రైతన్నలు పడ్డ కష్టాలను ప్రత్యక్షంగా చూసి కూడా వాటిని పరిగణలోనికి తీసుకోకుండా 2018 రుణమాఫీ పథకాన్ని కూడా నాలుగు సంవత్సరాల పాటు సాగదీశారని తెలిపారు. చివరకు ఆఖరి సంవత్సరంలో ఎన్నికలకు ముందు సగం మంది రైతన్నలకే రుణమాఫీ చేసిన నయవంచక బిఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని వివరించారు.
నాడు రుణమాఫీ తీరుఇది
2018లో ప్రకటించిన రుణమాఫీ, 2023 లో అమలు చేయడం వలన చేసిన రుణమాఫీ మొత్తం రూ.11,909.31 కోట్లలో నికరంగా అసలుకు జమా అయింది కేవలం రూ.3,394 కోట్లు మాత్రమేనని మంత్రి తుమ్మల వెల్లడించారు. మిగతా రూ.8,515 కోట్లు గత ప్రభుత్వ నిర్వాకం వల్ల వడ్డీకే సరిపోయిందని, దాంతో రుణమాఫీ పొందిన సగం మంది రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన తీరు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. రైతులకు ప్రయోజనకారిగా ఉన్న మా రుణమాఫీ విధానాన్ని అభినందించలేని బిఆర్‌ఎస్ నేతలు కుటిల బుద్దితో దానిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
పంటనష్టానికి పరిహారం
రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తూనే రైతు సంక్షేమం కోసం సన్న వడ్లకు బోనస్, వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి వాటిని ప్రభుత్వం అమలుచేస్తున్న తీరుతో రైతుకుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఎగ్గొట్టి, రైతుల ఉసురు పోసుకుందని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఏ ఒక్క రైతు ప్రకృతి వైపరిత్యం వల్ల కుదేలు కాకుడదనే ఉద్దేశ్యంతో ఎకరానికి పదివేల చొప్పున సహాయాన్ని పభుత్వం అందించిందన్నారు.
పంటల భీమా పునరుద్దరణ
పంటల భీమా పథకం నుంచి నాటి ప్రభుత్వం తప్పుకొని రైతులను నట్టేట ముంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని ఈ ఏడాది తిరిగి పునరుద్ధరిస్తు రైతుల ప్రీమియంలో సింహభాగం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతి రైతాంగం గుర్తించిందని వివరించారు. – భవిష్యత్ కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కావాల్సిన చర్యలన్నింటిని ప్రభుత్వం తీసుకుంటూ రైతుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.