Wednesday, January 22, 2025

బహుజన సిద్ధ్దాంతం అమలులో బిఆర్‌ఎస్ దారి దీపం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: విశ్రాంత ఐపీఎస్ అధికారి, బిఎస్‌పి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ కారెక్కారు. ఎర్రవెల్లిలోని నివాసంలో సోమవారం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రవీణ్‌కుమార్‌తో పాటు బిఎస్‌పి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు మర్రి జనార్ధన్ రెడ్డి, మెతుకు ఆనంద్, బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య, గువ్వల బాలరాజు, మాజీ చైర్మన్లు రవీందర్ సింగ్, బాలరాజు యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటిస్తానని కెసిఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నత స్థానంలో వుంటారని తెలిపారు.మంచి ఆశయం కోసం పనిచేసిన మీకు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయని చెప్పారు. దళిత శక్తినీ ఏకం చేసేందుకు బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు మనం నడుం కడుదామని పిలుపునిచ్చారు. కలిసి ఎజెండా తయారు చేద్దామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నిరుత్సాహ పరిచిండ్రు కానీ వెనక్కుపోలె అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అంతే అని, ముందుకు పోదామని అన్నారు. కన్విక్షన్ ఉంటే అసాధ్యం ఏమి వుండదు అని అన్నారు. మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నదని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదే అని పేర్కొన్నారు. బిఎస్‌పి నుంచి వచ్చినవాళ్ల మనసులో ఏముంటదో తనకు తెలుసని అన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కొన్ని చారిత్రక విషయాలు పంచుకున్నారు. బహుజన సిద్ధాం తం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలని కెసిఆర్ అన్నారు. స్పష్టమైన అవగాహన వచ్చేదాకా విపరీతమైన మేధోమథనం జరగాలని చెప్పారు. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారని, కానీ అట్లాం టి ఆలోచన సరికాదని అన్నారు.

దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయని, దళిత సమాజం దీన్ని పాజిటివ్‌గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలని కోరారు. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే ఏమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయని, తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలని అన్నారు. ఇండియాలో ఏ రాష్ట్ర సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టలేదు అని, దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు కలిసినం..36 పార్టీలను ఏకతాటిమీదికి తెచ్చామని కెసిఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి పదవిని కూడా తెలంగాణ సాధన కోసం ఉపయోగించానని చెప్పారు. గురుకుల విద్య అభివృద్ధిలో ప్రవీణ్‌కు ఎంతో సహకరించానని,దళిత బహుజన బిడ్డలను విద్యావంతులను చేశామని, వాళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఎదిగారని చెప్పారు. మీకు ఏ పార్టీలో లేని స్పేస్ బిఆర్‌ఎస్‌లో ఉంటుందని పార్టీలో చేరిన బిఎస్‌పి నేతలను ఉద్దేశించి కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడే నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం..పార్టీ నిర్మాణం చేసుకుందాం…కమిటీలు వేసుకుందామని తెలిపారు. మనం అద్భుతమైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుజన సిద్ధాంతాన్ని ఎజెండా బలంగా అమలు చేసే దిశగా భారత దేశానికి టార్చ్ బేరర్‌గా పనిచేయాలే అని పేర్కొన్నారు. బహుజన బేస్‌ను నిర్మిద్దాం ఒక అనివార్యతను సృష్టిద్దామని పిలుపునిచ్చారు.
కెసిఆర్ మాదిరిగానే మాట ఇస్తే మడమ తిప్పను : ప్రవీణ్‌ కుమార్
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తరహాలోనే ప్రవీణ్ కుమార్ సైతం మడమ తప్పడని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. పొత్తు రద్దు చేసుకోవాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఒత్తిడి తెచ్చారని, అయితే, అది తనకు ఇష్టం లేదని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే తాను బిఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లు తాను గొర్రెలమందలో ఓ గొర్రెను కాలేను అని పేర్కొన్నారు. తమ కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు.. కానీ సైద్ధాంతికంగా పేదలు కాదని అన్నారు. నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తామని.. వీళ్లందరినీ రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జై భీం..జై తెలంగాణ..జై కెసిఆర్ అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం మధ్యాహ్నం ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తనను తెలంగాణ భవన్‌కు సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకున్న బిఆర్‌ఎస్ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్యాకేజీల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ప్యాకేజీ తిసుకునే వాడినైతే తాను అధికార పార్టీలోనే చేరేవాడినని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సిఎం పొగుడుతూనే హెచ్చరించారు..
టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదించిన మాట వాస్తవమే అని,కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు వివరించారు. తనకు ఏ పదవులు అవసరం లేదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇటీవల ఓ ప్రెస్‌మీట్ రేవంత్‌రెడ్డి తనను పొగుడుతూనే.. హెచ్చరించారని ఆరోపించారు. ఓ వైపు పాలమూరు బిడ్డ అని చెబుతున్న రేవంత్.. మరోవైపు తాను బిఆర్‌ఎస్‌లోకి చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులో చేరడానికి అవడానికి తాను అసమర్థుడిని కానని పేర్కొన్నారు. నిజమైన, నిస్వార్థమైన, నిజాయతీ కోసం పనిచేసే వ్యక్తిని అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒక్కటే అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటే అని వ్యాఖ్యానించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News