Wednesday, January 22, 2025

తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తాం:హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: గులాబీ పార్టీ తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తుంది తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని, ప్రజాసేవకే అంకితమైన పార్టీ బిఆర్‌ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీసంలోని శోభా గార్డెన్‌లో నిర్వహించిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం పార్టీ ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తిరిగి బిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మంత్రి మాట్లాతుంటే సమావేశానికి హాజరైన కార్యకర్తలు పెద్దఎత్తున బిఆర్‌ఎస్ జిందాబాద్, సిఎం కెసిఆర్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలతో సమావేశ పరిసరాలు మారుమోగాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధ్ది , సంక్షేమ పధకాలు యావద్దేశానికే ఆదర్శంగా మారాయని, దీంతో కేంద్ర ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాలలో కూడా మన పధకాలను కాపీ కొడుతున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధ్ది చేసేందుకు సిఎం కెసిఆర్‌కు ఉన్న స్పష్టమైన విజన్ ఉందని, అందుకే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందన్నారు. గత 60 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధ్దిని 6 సంవత్సరాలలో చేసి చూపిన మన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని మరో 60 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారన్నారు. గజ్వేల్ అభివృద్ధ్ది గజమాల లాంటిదని మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాకముందు తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నరోజుల్లో ఆనాడు రైతులు , చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే పక్క రాష్ట్రాల నుంచి విలేకరులు వచ్చి వార్తలు రాస్తుండేదని ఆనాటి సంఘటనలను మంత్రి గుర్తు చేశారు. గతంలో గణేష్ బతుకమ్మ పండుగలు వచ్చాయంటే నిమజ్జనాలకు ఏచెరువులో వేయాలో తెలియని నీటి కరువు ఉండేదన్నారు. గజ్వేల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చింతర్వాత రింగు రోడ్డు, పార్కులు,రైల్వే స్టేషన్, డ్యాములు వచ్చాయన్నారు. గతుకుల గజ్వేల్‌ను బతుకుల నిలయంగా సిఎం కెసిఆర్ మార్చిండన్నారు.

Also Read: అధికారం అండగా ప్రభుత్వ భూమి కబ్జా..

సిఎం కెసిఆర్ గజ్వేల్‌కు రాక ముందు యాసంగిలో 7వేల ఎకరాల వరిసాగైతే కెసిఆర్ వచ్చిన తర్వాత 17 వేల ఎకరాలను సాగుచేస్తున్నారని, రైతుల గోస తెలసిన సిఎం కనుకనే సాగునీటి కష్టాలకు తనదైన శైలిలో చెక్‌పెట్టారని జల వనరుల అభివృద్ధ్దిపై మంత్రి హరీశ్‌రావు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చినిలబెట్టిన ముఖ్యమంత్రుల్లో ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు మన కెసిఆర్ మాత్రమే నన్నారు. నిజాలను ఎప్పుడూ ప్రజల ముందు ఉంచాలని ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అనే వారని , అదే విధంగా తాము చేసిన పనులు, రాష్ట్రాభివృద్ధ్దికి చేసిన కృషిలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి హరీశ్‌రావు చెబుతూ భవిష్యత్‌లో ప్రజల ముందుకు వెళ్లాల్సిన అంశాన్ని కార్యకర్తలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఎవరైనా బిఆర్‌ఎస్ కార్యకర్తలను గజ్వేల్‌కు ఏం చేశారని ప్రశ్నిస్తే వారికి జరిగిన అభివృద్ధ్ది పనులను ప్రతి కార్యకర్త తమ గుండె మీద చేయి వేసుకుని చెప్పే ధైర్యాన్ని సిఎం కెసిఆర్ ఇచ్చారన్నారు.

ఈ రాష్ట్రంలో కానీ గజ్వేల్‌లో కానీ ఏదైనా అభివృద్ధ్ది జరిగిందంటే అది సిఎం కెసిఆర్ సారధ్యంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధ్దితో దేశాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయాలని, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మన కెసిఆర్ బయలు దేరిండని, ఇప్పుడు మన నినాదం ఒకటే నని అదే రైతు నినాదం అన్నారు. రానున్న కాలంలో ఇదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త, నాయకులు ఐకమత్యంతో అందరం కలిసి పనిచేసి బిఆర్‌ఎస్‌ని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆత్మీయ సమ్మేళనాల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాక్రిష్ణ శర్మ,డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పాల రమేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెరుకు చంద్ర మోహన్ రెడ్డితో పాటు పలువురు ఎంపిటిసిలు,ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News