Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం… బిజెపి ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల కోసం బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కు
లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టే
అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కెసిఆర్ పోటీపడ్డారు
బిఆర్‌ఎస్‌లో బావాబామ్మర్దులే పోటీ
కెసిఆర్ బయటకు వస్తే జరిగేదేమీ లేదు
సోనియాగాంధీ నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి
పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్ చచ్చిపోయిందని, దేశానికి బిజెపి ప్రమాదకరంగా మారిందని సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై లోక్‌సభ ఎన్నికలకు రాబోతున్నాయని వారి కుట్రలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మూడోసారి ప్రధానిని చేసేందుకు మోడీతో బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని ఆయన విమర్శించారు. అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కెసిఆర్ పోటీపడ్డారని రేవంత్ విమర్శించారు. బిఆర్‌ఎస్‌లో బావాబామ్మర్దులే పోటీపడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బిఆర్‌ఎస్ ఏనాడు కేంద్రంతో పోరాడలేదన్నారు. కెసిఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి 17 సీట్లు గెలిస్తే తెలంగాణకు మేలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర హక్కులు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో సి ఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు.
కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులకు కూడా అపాయింట్‌మెంట్ ఇస్తా
ఈ సమావేశం అనంతరం సిఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తనను కలవొచ్చని ఆయన సూచించారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులు కూడా అపాయింట్‌మెంట్ కోరవచ్చని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల సమస్యలు అందరం కలిసి పరిష్కారం చేసుకుందామన్నారు. కామారెడ్డిలో కెసిఆర్ చిత్తుగా ఓడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘కెసిఆర్ బయటకు వస్తే జరిగేదేమీ లేదని, కెసిఆర్ మాట్లాడేదేమిటి? తాను వినేదేమిటి?’ అని సిఎం రేవంత్ మండిపడ్డారు.
ఆరు పథకాల అమలుకు కార్యాచరణ
60 రోజుల్లో లోక్‌భకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ఆయన సూచించారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని ఆయన తెలిపారు. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పిసిసి చీఫ్ అయ్యాక 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర సభ నిర్వహించామని, అదే సెంటిమెంట్ తో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారం ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.
రాజకీయ కుట్రతోనే కోదండరాం ప్రమాణ స్వీకారం వాయిదా
రాజకీయ కుట్రతోనే గవర్నర్ ఎమ్మెల్సీల కోదండరాం ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసే కుట్ర చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. చెప్పులు మోసే వారితో కోదండరాం గారితో పోలికనా? అని సిఎం విమర్శించారు. బిఆర్‌ఎస్ నాయకులు ఓటమితో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల పరిశీలకుల నియామకం
లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆయన సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ఎంపి అభ్యర్థుల ఎంపికకు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను నియమించిందన్నారు. హరీష్ చౌదరీ చైర్మన్‌గా కమిటీ ఈ పనులు చూస్తుందని ఆయన వివరించారు. ఆ కమిటీ అభ్యర్థుల ఎంపిక చూసుకుంటుందన్నారు.
రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక అధిష్టానానిదే….
ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాజ్యసభ ఎన్నిలకు అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ బాధ్యతను బదిలీ చేస్తూ పీఈసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులను చేసుకోవాలని ఆయన సూచించారు. ఓసీలు అప్లికేషన్ రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు రూ.25 వేలు చెల్లించాలని ఆయన చెప్పారు.
దేశం దివాళా తీయడానికి మోడీనే కారణం
కెసిఆర్ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే, మోడీ దేశ ప్రజలపై రూ.100 లక్షల కోట్ల అప్పు మోపారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశం పూర్తిగా దివాళా తీయడానికి మోడీనే కారణమన్నారు. మోడీ రైతులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. మోడీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంలో బిజెపి ఘనత సాధించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో అంతటి హింస జరిగితే మోడీ అక్కడికి వెళ్లలేదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు దేశానికి ప్రధాని అవ్వడం అవసరమన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటోందన్నారు.
రాష్ట్రం నుంచి సోనియా ఎన్నికల్లో పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రం నుంచి రాబోయే ఎన్నికల బరిలో సోనియాగాంధీ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని సిఎం రేవంత్ అన్నారు. కానీ, సోనియాగాంధీ నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్న పార్టీలు గౌరవం ఇచ్చినట్టు అని ఆయన తెలిపారు. సోనియా గాంధీ నామినేషన్ తరువాత ఆమెపై తెలంగాణ బిడ్డలు ఎవరూ కూడా పోటీ చేస్తారని తాము అనుకోవడం లేదని ఆయన వెల్లడించారు. సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేత పత్రం
బడ్జెట్ లో హామీలకు సంబంధించి కేటాయింపులు ఉంటాయన్నారు. ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ విచారణ మొదలయ్యిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలు పెట్టిందన్నారు. గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News