Thursday, January 23, 2025

తొలి దక్షిణాది జాతీయ పార్టీ

- Advertisement -
- Advertisement -

KCR enter into national politics

ధర్మానికి హాని జరిగినపుడు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన పురాణ గాథలని చదివాము. యుగాలు మారినా శ్రీమహావిష్ణువు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడు అయ్యారు. హిరణ్యకశిపుడిని వధించడానికి నరసింహుడయ్యారు. శిశుపాలుడిని నిర్జించడానికి శ్రీకృష్ణుడయ్యారు. పాపులను, దురాత్ములను భగవంతుడు ఎన్నటికీ క్షమించడు. వారి పాపాలు పండేంత వరకు సహిస్తాడు. ఆ తరువాత సంహరిస్తాడు. కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు అనేదే శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత సారాంశం.

ఈనాటి కాలంలో కూడా అలాంటి మహాద్భుతాలు జరుగుతుండొచ్చు కానీ మనం ఆ దృక్కోణంలో నుంచి పరిశీలించలేము. మన దృష్టికి, బుద్ధికి అలాంటి మహత్వ విషయాలు అందవు. రాజకీయాల్లో కూడా అపుడపుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అధికారంలో ఉన్నవాళ్లు నియంతలుగా మారి ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, ప్రజలను పీడిస్తూ, భూస్వాముల కొమ్ము కాస్తూ, అవినీతిపరులను అందలం ఎక్కిస్తున్న సమయంలో అనుకోకుండా కొందరు మహాత్ములు తెర మీద కొస్తారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో ఉద్యమం చేస్తున్నప్పుడు మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారిని తరిమేయడం చూశాం.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముప్ఫయి సంవత్సరాలు అవిశ్రాంతంగా దేశాన్ని పరిపాలించింది. దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినప్పటికీ ఇందిరా గాంధీ నియంతృత్వ వైఖరితో ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితితో దేశం మొత్తం విలవిలలాడిపోయింది. ప్రతిపక్ష నాయకులందరూ జైళ్లలో బంధించబడ్డారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను తొక్కిపెట్టారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను చెరపట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఇందిరా గాంధీని ఎదిరించి ప్రజాస్వామ్యానికి ఊపిరులు పోయగల మహనీయుడి కోసం దేశం మొత్తం చకోరపక్షిలా ఎదురు చూసింది. ఆ సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ దేశరాజకీయాల పాలిటి దివిటీగా ప్రభవించారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటి మీద నిలిపి జనతా పార్టీ అనే పేరుతో పోటీ చేయించి కాంగ్రెస్ పాలనకు చరమగీతాన్ని పాడారు.

ఆ తరువాత జనతాపార్టీ ప్రయోగం విఫలమై, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీ విధించప్పటికీ దేశంలో పేట్రేగిపోయిన ఉగ్రవాదం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలద్రోయడం లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ముప్ఫయి సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించింది. 1980 ఎన్నికల తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోయడం పట్ల దేశం మొత్తం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. దాంతో ఇందిరా గాంధీ మీద పగబట్టిన ఎన్‌టిఆర్ తోక తొక్కిన త్రాచులా మారి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి ఇందిరా గాంధీ మెడలు వంచి మళ్ళీ తన ప్రభుత్వాన్ని ఏర్పరచేట్లు చేయగలిగారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ అఖండమైన మెజార్టీతో గెలిచారు. అంతటితో ఆగకుండా దేశం మొత్తం పర్యటించి ఆనాటి మహా నాయకులు వాజపేయి, అద్వానీ, ఫెర్నాండేజ్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, ఎంజీయార్, రామకృష్ణ హెగ్డే, విపి సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, లాంటి రెండు డజన్ల మంది నాయకులతో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించగలిగారు.

దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటి? ఎంతటి గొప్ప పాలకులైనా, నిరంకుశులైనా, ప్రజాస్వామ్యం లో ఓటమికి అతీతులు కారు. ప్రతిపక్షాలలో ఐక్యత లోపించబట్టే కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ అధికారంలోకి రాగలుగుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి లభించింది 31 శాతం ఓట్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అంటే కనీసం 50 శాతం ఓటింగ్ కూడా లేకుండానే రెండుసార్లు బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? బిజెపి అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు పూర్తి అన్యాయం చేసిందని టిఆరెస్ పార్టీ ఆరోపిస్తున్నది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన ఏ ప్రయోజనాలూ ఇవ్వడం లేదు. పైగా అనేక ఆటంకాలను కల్పిస్తున్నది. ప్రతిపక్షాలను బెదిరించడానికి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని వాటిని దుర్వినియోగం చేస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో మెజారిటీ లేకపోయినప్పటికీ అధికార పార్టీలో చిచ్చుపెట్టి చీల్చివేసి ప్రభుత్వాలను పడగొడుతున్నది. మరి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వంతో నిత్యసమరం చేస్తున్నది.

CM KCR announced the National Party

ఇలాంటి పరిణామాలన్నింటినీ గమనించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరొక జాతీయ పార్టీని ఏర్పాటు చెయ్యాలని సంకల్పించి గత ఏడాదిగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రముఖ నాయకులను కలుస్తున్నారు. నితీష్ కుమార్, స్టాలిన్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, దేవెగౌడ, కుమార స్వామి, హేమంత్ సొరేన్, పినరాయి విజయన్ లాంటి అగ్రనేతలను కలిసిన కెసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పట్ల సంపూర్ణ అవగాహనకు వచ్చారు.

అంతే కాదు.. కొంత కాలం క్రితం ఢిల్లీలో కొందరు మాజీ ఉన్నతాధికారులతో సమావేశమై దేశ పరిస్థితులను గూర్చి చర్చించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలా నడపాలి? వివిధ ప్రాంతాల ప్రజలను ఎలా ఒప్పించాలి? ఎలాం టి అజెండాను ప్రజల ముందు పెట్టాలి? అనే అంశాలపై ఇప్పటికే ఆయన కసరత్తు చేశారు. ప్రజలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చెయ్యాలని భావిస్తున్నారు. తెలంగాణాలో రైతులకు ఇస్తున్నట్లే దేశంలోని రైతులు అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. క్రమక్రమంగా రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక సంక్షేమ పథకాలను దేశం మొత్తం విస్తరించాలని, తద్వారా దేశ ప్రజలను ఆకర్షించాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు.

అన్ని రకాల అధ్యయనాలు పూర్తయ్యాకే విజయదశమి రోజున కెసిఆర్ భారత రాష్ట్ర సమితి అనే కొత్త జాతీయ పార్టీని తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకుల హర్షద్వానాల నడుమ ప్రకటించారు. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ అని పిలవబడిన ప్రాంతీయ పార్టీ ఇకపై బిఆర్‌ఎస్ అనే జాతీయ పార్టీగా పిలవబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన డిసెంబర్ తొమ్మిదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ సభ ఏర్పాటు చేసి జాతీయ నాయకులను ఆహ్వానించాలని కేసీఆర్ తలపోస్తున్నారు.

CM KCR inaugurated Adivasi and Banjara buildings

అలాగే జాతీయ స్థాయిలో ప్రచారం కోసం ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడంలో లేక విలీనం చేసుకోవడమో చేస్తూ హిందీ భాషపై పట్టున్న వక్తలను ఎన్నుకుని పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారంటున్నారు.బిజెపి ముక్త్ భారత్ అని కెసిఆర్ ఏనాడో పిలుపిచ్చిన సంగతి మరువరాదు. దేశాన్ని పీడిస్తున్న బిజెపి పాలన నుంచి ప్రజలను రక్షించడమే తన కర్తవ్యం అని అనేక సార్లు కెసిఆర్ ప్రకటించారు. కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని వార్తలు రావడంతోనే విపక్షాలు ఆయనపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం మొదలుపెట్టాయి.

కెసిఆర్ జాతీయ పార్టీని పెట్టడమే తప్పు అన్నట్లుగా కొందరు అవహేళన చెయ్యడం విస్తు గొలుపుతుంది. నిజానికి దక్షిణ భారతదేశం నుంచి గత 75 ఏళ్లలో జాతీయ పార్టీ అంటూ లేదు. దేశాన్ని శాసిస్తున్న రెండు జాతీయ పార్టీలు ఉత్తరాదివే. దక్షిణా పథం నుంచి ఒక్క జాతీయ పార్టీ కూడా లేకపోవడంతో ఉత్తరాదివారితో పోల్చినపుడు మన నాయకులకు విలువ తక్కువే. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు మాత్రమే కేంద్ర మంత్రిగా ఉన్నారంటే మనకున్న గౌరవం ఏమిటో తెలుసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీని స్థాపించినంత మాత్రాన దానితోనే రాజకీయ జీవితం మొత్తాన్ని గడిపేయాలని నిబంధన లేదు. నలుగురు విద్యార్థులు ఎమ్మే చదివారనుకుందాం.

వారిలో ముగ్గురు తమ చదువుకు తగిన ఉద్యోగంలో చేరి తృప్తి పడతారు. ఒకరు మాత్రం పిహెచ్‌డి చేస్తారు. ప్రొఫెసర్ అవుతారు. దాంతో కూడా సరిపెట్టుకోకుండా సివిల్ సర్వీసెస్ రాస్తారు. ఐపిఎస్‌కు సెలెక్ట్ అవుతారు. ఇంకా తృప్తి తీరక మళ్ళీ పరీక్ష రాసి ఈసారి ఐఎఎస్ అవుతారు. జిల్లా కలెక్టర్ అవుతారు. కెసిఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. టిఆర్‌ఎస్ అనే ప్రాంతీయపార్టీని స్థాపించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. దేశం మొత్తం తెలంగాణ పధకాలను అమలు చేయాలనుకుంటున్నారు. అందుకోసం జాతీయ పార్టీ పెడుతున్నారు. తప్పేముంది? కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడం కోసం కష్టపడాలి అన్నారు కదా డాక్టర్ అబ్దుల్ కలాం మహాశయుడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News