Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్‌కు జేజేలు ‘మహా’ పార్టీలకు బెంబేలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ‘మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాద బలం. ఈ బలంతోనే సిట్టింగ్ ఎంఎల్‌ఎలు అనేక మంది నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీరే చూస్తారు మహారాష్ట్రలో ఏం జరుగబోతున్నదో? ’ అని సిఎం కెసిఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర ముఖ్యనేతలతో ఆయన సమాలోచనలు చేశారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. మే 10 నుంచి జూన్ 10 దాకా మహారాష్ట్ర మూల మూలకు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ము ఖ్యనేతలతో సిఎం కెసిఆర్ చర్చించిన అనంతరం ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ప్రభు త్వ విప్ బాల్క సుమన్, పియుసి చైర్మన్ జీవన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనాచారి,ఎంఎల్‌ఎ జోగురామన్న,మాజీ ఎంపిగెడాం నగేశ్, మహారాష్ట్ర ముఖ్యనేతలు మాణిక్ కదం, మాజీ ఎంఎల్‌ఎ శంకరన్న డోంగే, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, మాజీ ఎంపి హరిబావ్ రాథోడ్, సుధీర్ సుధాకరరావు బిందు, సువర్ణ కాటే బగల్, మాజీ మేయర్ రవీంద్రసింగ్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ప్రభంజనం వలె ఎగిసిపడుతున్నదని, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్‌ఎలు, జడ్‌పి చైర్మన్లు, బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే బిఆర్‌ఎస్‌లో చేరడమే ఇందుకు తార్కాణమన్నారు. కొంతమంది సిట్టింగ్ ఎంఎల్‌ఎలు రావటానికి సిద్ధంగా ఉన్నారని, అనేక మంది తనతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఇదే మన నినాదమన్నారు. బిఆర్‌ఎస్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చి వారి ప్రేమను పొందాలని పిలుపునిచ్చారు. ప్రజల మనసులు గెలవడం బిఆర్‌ఎస్ లక్ష్యమన్నారు.

ఈ క్రమంలో మనం వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వొద్దని సూచించారు. బిఆర్‌ఎస్ ఆత్మస్థెర్యం, మనోనిబ్బరం, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధి కార్యాచరణ మహోన్నతమైందన్నారు. ఈ క్రమంలో మనం మన లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దని, వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యమని ఉద్బోదించారు. పదవులు (పార్టీ పదవులైనా.. ప్రజాప్రతినిధులైనా ) వచ్చేదాకా పాదాలు పట్టుకొని ప్రార్థించి, పదవులు రాగానే కండ్లు నెత్తికి పోయే దుస్థితి బిఆర్‌ఎస్‌కు లేదన్నారు. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ తరువాత మహారాష్ట్రకే దేశాన్ని మలుపుతిప్పే అవకాశం వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు మూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తవుంతుందని వెల్లడించారు. మే 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కావాలన్నారు. ఒకే రోజు ఒకే సమయంలో 288 నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావాలని, మహారాష్ట్ర రాజకీయాల మార్పు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు శ్రీకారమవ్వాలని ఆకాంక్షించారు.

బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో కాలు మోపగానే కిసాన్ సమ్మాన్నిధిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు తలాటీ (విఆర్‌ఎ) వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇవే బిఆర్‌ఎస్ తొలివిజయమన్న సంకేతాలన్నారు. బిఆర్‌ఎస్ పూర్తిగా మహారాష్ట్రలో ల్యాండ్ కాకముందే రెండు అద్భుత విజయాలను సాధిస్తే బీఆర్‌ఎస్ అదికారంలోకి వస్తే ఇంకెన్నిచేయవచ్చు? ఎలా చేయవచ్చు అనే విషయాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రజాచైతన్యమే బిఆర్‌ఎస్ ఆయువుపట్టు అని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి తీరుతామనేందుకు రెండు విజయాలే నిదర్శనాలని పేర్కొన్నారు.

శివాజీ, అంబేద్కర్ విగ్రహాల నుంచే మన పార్టీ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. మే 8,9 తేదీల్లో మహారాష్ట్రలోని నియోజకవర్గాలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రియాశీల సభ్యత్వానికి రూ. 50గా ధరను నిర్ణయించడం జరిగిందన్నారు. క్రియాశీల సభ్యులకే పదవులు. సర్పంచ్ మొదలు ఎంపి ఇలా అన్ని స్థాయిల పదవులకు ప్రథమ అర్హత క్రియాశీల సభ్యత్వమనే విషయాన్ని మరువొద్దని సూచించారు. జిల్లా సమన్వయకర్తలు, వారి పరిధిలో ఉండే నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. సంస్థాగత నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలు, పట్టణ/నగర ప్రాంతాల్లో వార్డు కమిటీలు. బిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ కమిటీల్లో రైతు, ఎస్‌సి, ఎస్‌టి, యువజన, మహిళా, విద్యార్థి సహ 9 కమిటీలు. ప్రతీస్థాయి కమిటీల్లో ఆయా ప్రాంతాల జనాభాకు అనుగుణంగా కమిటీ సభ్యుల సంఖ్య ఉండేలా చూడాలన్నారు. మహారాష్ట్రలోని ఆరు డివిజన్లల్లో 288 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీల నియామకం దాదాపుగా పూర్తయిందని వెల్లడించారు. పార్టీ ప్రచార సామాగ్రి (టోపీలు, జెండాలు, కండువాలు, పోస్టర్లు, కరపత్రాలు తదితరమైనవి ) నియోజకవర్గాల వారీగా పంపిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News