Sunday, December 22, 2024

కారు కసరత్తు

- Advertisement -
- Advertisement -

జనవరి నుంచి సన్నాహక సమావేశాలు
తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… జనవరి 13 నుంచి 15 వరకు మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యులందరికీ ఆహ్వానం
జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించనున్న బిఅర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు:

జనవరి 3వ తేదీన ఆదిలాబాద్
జనవరి 4వ తేదీన కరీంనగర్
జనవరి 5వ తేదీన చేవెళ్ల
జనవరి 6వ తేదీనపెద్దపల్లి
జనవరి 7వ తేదీన నిజామాబాద్
జనవరి 8వ తేదీన జహీరాబాద్
జనవరి 9వ తేదీన ఖమ్మం
జనవరి 5వ తేదీన వరంగల్
జనవరి 11 తేదీన 11న మహబూబాబాద్
జనవరి 12వ తేదీన భువనగిరి

సంక్రాంతి అనంతరం..
జనవరి 16వ తేదీన నల్గొండ
జనవరి 17వ తేదీన నాగర్ కర్నూలు
జనవరి 18వ తేదీన మహబూబ్ నగర్
జనవరి 19న తేదీన మెదక్
జనవరి 20వ తేదీన మల్కాజ్ గిరి
జనవరి 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News