వనపర్తి : తెలంగాణలో మూడవసారి అధికారం బిఆర్‌ఎస్ పార్టీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని బాదం సరోజిని దేవి ఫంక్షన్ హాల్‌లో మండంలోని 27 గ్రామాల ప్రజలతో వేర్వేరుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని అన్నారు. కరోనా విపత్తులో కూడా రైతాంగానికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతు బంధుతో ఆదుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో పడావుపడ్డ చెరువులను పునరుద్ధరించి కృష్ణా, గోదావరి నీళ్లతో నింపి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చామని అన్నారు.
సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి ఫలితంగా తెలంగాణ పల్లెలు పచ్చబడ్డాయని అన్నారు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా, గౌరవంగా జీవనం గడుపుతున్నారని అన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గ్రామాలలో ఇండ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి దశలవారిగా గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని అన్నారు. రూ. 3.30 కోట్లతో నిజలాపూర్ నుంచి మహ్మద్ హుస్సేన్ పూర్ వరకు రహదారి మంజూరైందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గతంలో నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధు అమలు చేయడం జరిగిందని, ఈ విడతలో నియోజకవర్గానికి వెయ్యి మందికి దళిత బంధు అమలు చేస్తామని అన్నారు.
ప్రభుత్వం చేయూతతో ప్రతి ఒక్కరు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్షమని అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఐటి పారిశ్రామిక రంగాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కళాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా ఫించన్లు, రైతుబంధు, దళిత బంధు, రైతు భీమా, కెసిఆర్ కిట్, పోషకాహార కిట్లు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దశల వారిగా అందరికి అన్ని పథకాలు వందశాతం అమలుచేస్తామని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు.