Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం

- Advertisement -
- Advertisement -

నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్‌లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్‌లో కాంగ్రెస్ గెలిచినా, ఆరు రాష్ట్రాలలో బిజెపి అభ్యర్థులు చిత్తుగా ఓడినా వచ్చే లోక్‌సభ నాటికి బిజెపిని ఎదిరించ గల సత్తా ఉన్న పార్టీయేదీ కనుచూపు మేరల్లో కనపడ్డం లేదు. ఈ దేశంలో రాజకీయ శూన్యత ఉందనే ఏకాభిప్రాయంలో అందరూ ఉన్నా మరి ప్రత్యామ్నాయం ఎవరన్నది మల్లగుల్లాలు పడే పరిస్థితి. ఈక్రమంలోనే కేంద్రంలోని బిజెపి సర్కారును గద్దెదింప గల సమర్ధ నాయకత్వం కోసం యావత్తు దేశం అన్వేషిస్తున్నది. దేశంలో తిష్ట వేసిన సమస్యలు, ఎజెండాతో కొట్లాడి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఏకతాటిపై తీసుకురా గలిగిన సమర్థ నాయకత్వం ఎవరన్న చర్చ జరుగుతున్నది. తాజాగా సిఎం కెసిఆర్ నెలకొల్పిన జాతీయ పార్టీ బిఆర్‌ఎస్, దాని ప్రస్థానంపై చర్చకొస్తున్నది. సరైన సమయంలో సరైన దిశా నిర్దేశంతో కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు వెల్తున్నారని చెప్పాలి.

గత ఎనిమిదేళ్లుగా దేశంలో పేట్రేగుతున్న నియంతృత్వం, పెచ్చరిల్లుతున్న కుల, మత రాజకీయాలకు తోడు ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, రాష్ట్రాల హక్కులను కాలరాయడం, ప్రజా ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని హత్య చెయ్యడం, పెట్రోభారం, ధరాభారం, నిరుద్యోగ రక్కసి, పన్నుల మోత ఇత్యాదివన్నీ చెప్పుకొంటేపోతే మోడీ ఎనిమిదేండ్ల ఏలుబడిలో ఏ ఒక్క రంగం కూడా సంతృప్తికరంగా లేదు. పైసమస్యలపై నినదించిన, నిలదీసినా జాతీయ పార్టీ లేవి లేవు కూడా. అందుకే ఇవాళ మోడీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం అది కూడా పీపుల్స్ ఏజెండాతో కూడిన జాతీయ రాజకీయాలు కావాలని కెసిఆర్ తలపోస్తున్నారు. ఓట్లు, సీట్ల ప్రాతిపదికన కాకుండా ఈ దేశం ఏం కోరుకుంటోంది అనే ప్రశ్నలను సంధిస్తున్నారు. వ్యవసాయాధారిత దేశంలో ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వరు… వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఆదుకోరు అన్న సహజమైన డిమాండ్‌ను ప్రజల ముందుంచారు. దేశంలో పుష్కలమైన సహజ వనరులున్నా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నది అనే కోణంలో చర్చకు తెర లేపారు.

అందుకే బిజెపి ముక్త్ భారత్ నినాదాన్ని కెసిఆర్ తొలుత అందుకున్న తర్వాతే మిగితా విపక్ష రాష్ట్రాల సిఎంలు నినదించే పరిస్థితి. ఇవాళ ఈ దేశంలో బిజెపిని అత్యంత మొండి ధైర్యంతో ఎదుర్కొని రాజకీయాలు నెరపేది కేవలం కెసిఆర్ ఒక్కరే. అత్యంత క్లిష్ట ప్రతికూల పరిస్థితుల్లో పుట్టి టిఆర్‌ఎస్ విజయవంతం కాగలినప్పుడు కెసిఆర్ నేషనల్ పార్టీ ఎందుకు సక్సెస్ కాదు..? ప్రజా ఎజెండా రూపకల్పనతో జనం మధ్యే చర్చ పెట్టి అదే జనం నుండి నాయకులను ఎందుకు పుట్టంచలేరు. పాత మూస రాజకీయాలకు చరమగీతం పాడి ఎందుకు ముందుకు వెళ్లలేరు? తెలంగాణలో వలే ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాలు వర్తింపచేసి దేశం రైతాంగం బాగు ఎందుకు కోరుకోకూడదు. ఈ దేశంలో ఉన్న మెజారిటీ బిసి, ఎంబిసి, ఒబిసి వర్గాల సమస్యల ఎజండా, విద్య, వైద్యం, ఐటి ఇత్యాది రంగాల్లో పేరుకుపోయిన సమస్యల బూజు ఎందుకు దులపకూడదు? అది కేవలం కెసిఆర్ వల్ల మాత్రమే సాధ్యమని బలంగా ఎందుకు చెప్పకూడదు వంటి చర్చ సాగుతున్నది.

అందు కే దేశం పిలుపుకు కెసిఆర్ ఆమోదం తెలిపారని వార్తలు రావడం, జాతీయ పార్టీ ఏర్పాటు ప్రస్థానం ఆరంభమైందన్న వార్తలను ఆర్ధిక, రాజకీయ, వ్యవసాయ, శాస్త్రీయ రంగాలపై లోతైన అధ్యయనం జరుపుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని దేశమే సృష్టించుకుంటున్న చరిత్ర చూస్తున్నాం. అవసరమైనప్పుడల్లా ఇండియా రియాక్ట్ అవుతున్నది. ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్‌లో ఎవరున్నా జాతీయ నాయకుడిగా ఎదగనీయలేదు. ఆమె నియంతృత్వ ఫలితంగా కాంగ్రెస్ బలహీన పడటం, ప్రాంతీయ పార్టీలు రావడం, జాతీయ రాజకీయాలు మాయం కావడం, బలమయిన ప్రాంతీయ నాయకులు పుట్టారు. అందుకే 1982లో తెలుగుదేశం, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి, 2011లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వచ్చాక బలమయిన ప్రాంతీయ నాయకులు బలంగా ఎదిగారు.

ఆ క్రమంలోనే ప్రాంతీయ పార్టీల కూటమికి జాతీయ స్థాయిలో అవసరమైనపుడు వాటికి ఛైర్మన్‌గా ఒకసారి ఎన్‌టి రామారావు, మరొక సారి చంద్రబాబు నాయుడు నియమితులయ్యారు. అయినా సరే వాళ్లకి జాతీయ నాయకుడికుండాల్సిన హోదా రాలేదు. ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే ‘కింగ్ మేకర్లు’ అనిపించుకున్నారు. ఈ లెక్కన దక్షిణాది వాళ్లు కింగ్ మేకర్లు అయ్యారు తప్ప కింగ్స్ కాలేకపోయారు. పివి నర్సింహారావు ఒక్కరే దక్షిణాది నుండి ప్రధానిగా సుస్థిర ప్రభుత్వంలో ఉండగలిగారు. అయితే ఇది గతించిన చరిత్ర. పొలిటికల్ డైమెన్షన్, డైవర్షన్స్ అన్నీ బేరీజు వేసుకుంటూ పోతే 2023 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతున్నది. ఇప్పుడు మోడీ హయాంలో నియంతృత్వం మరింత పెచ్చరిల్లింది. ప్రాంతీయ పార్టీలను పాతరేసే కుట్రకు తోడు రాష్ట్రాల హక్కులు కాలరాస్తుండడం, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసే సంస్కృతి బిజెపి హయాంలోనే హెచ్చుతున్నది.

29 రాష్ట్రాలలో కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే బిజెపికి స్పష్టమైన మెజార్టీ ఉన్నా, పది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల సహకారంతోనే డబుల్ ఇంజిన్ సర్కార్లను ఏర్పాటు చేయగలిగింది. ఇందులో రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలను కూల్చి దొడ్డిదారిన అధికారంలోకి రాగలిగింది. ఇప్పటికే ఉత్తర, దక్షణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అయితే వన్ నేషన్ వన్ పార్టీ అనే మోనోపలి నినాదంతో దేశంలో మిగిలిన పార్టీలను పెద్ద పామువలే బిజెపి తింటూ పోతున్నది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను బతికుంచుకునేందుకు, రాష్ట్రాల హక్కులు కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయ వేదిక అనివార్యమవుతున్నది. అయితే ఆ వేదికను తయారు చేసేదేవరు..? బలంగా ఓట్లు సీట్లు, కూటమి ఏర్పాటు చర్చకాకుండా ఎజెండాతో బలమైన నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నది. ఒక్కసారి చరిత్ర చూసినా వర్తమాన రాజకీయాలు ఆవిష్కరించినా భావి రోజుల్లో కెసిఆర్ మాత్రమే జాతీయ రాజకీయాలను నెరపగలరు.

గతంలో ప్రజాదరణ గల ఎంజి రామచంద్రన్, ఎన్‌టి రామారావులు కూడా ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఎన్‌టి రామారావు ఒకసారి ‘భారత దేశం పార్టీ’ అని జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినా జాతీయ రాజకీయ నాయకుడు కాలేకపోయారు. అలాగే తెలుగు రాష్ట్రాలు రెండయ్యాక, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడయ్యారు తప్ప ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ పాత్ర పోషించిందెపుడూ లేదు. ఆల్ ఇండియా అని పేరులో తగిలించుకున్న ఎఐడిఎంకె ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులో బలంగా ఉన్నపుడు కూడా నేషనల్ పొలిటీషన్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఇపుడు దేశ రాజకీయాల్లో నేషనల్ పొలిటీషన్ రోల్ పోషిస్తున్న వ్యక్తి ఒక్కరే ఆయన హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసి. దేశ రాజకీయాల్లో కాకపోయినా, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ఎఐఎంఐఎం తరఫున ఆయన దేశమంతా తిరుగుతూ ‘సొంత పార్టీ జాతీయ నాయకుడు’ అయ్యారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి అవసరమయిన ప్రధాని కావాలనుకున్నవాళ్లు ప్రాంతీయ పార్టీలలో చాలా మంది ఉన్నారు. శరద్ పవార్, ములాయం సింగ్, మాయావతి, మమతా బెనర్జీ. వీరంతా తమ రాష్ట్రాల్లో సొంత పార్టీలను బిజెపి ముప్పు నుంచి కాపాడుకునేందుకు 24×7 అప్రమత్తంగా ఉండే పరిస్థితి మోడీ సృష్టించారు. అందువల్ల వీళ్లు జాతీయ రాజకీయాల్లో పాత్ర దొరికితే పోషిస్తారేమో తప్ప ఫుల్ టైం పొలిటీషన్ అయ్యే అవకాశం లేదు. శరద్ పవార్‌కి, ములాయం సింగ్‌కు రాలేదు. ఆర్‌జెడిలో ఇదే పరిస్థితి. మమతా బెనర్జీకి వారుసులే లేరు. తమిళనాడులో పవర్‌లో ఉన్నపుడే కరుణానిధి కూడా వారుసునిగా స్టాలిన్ తీర్చిదిద్దినా, తమిళ నేతలకు నేషనల్ పొలిటిషన్ కావాలనే యాంబిషన్ బాగా తక్కువు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కి కూడా జాతీయ రాజకీయాల్లో మోజున్నట్లు కనిపించదు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ నాయకుడుయ్యే అన్ని యోగ్యతలున్నవారు. కాకపోతే, ఆయనకు ఢిల్లీని న్యూఢిల్లీ నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి యోగ్యతలున్నా వనరులు, సమయం తక్కువ. ఇక చంద్రబాబు ఇప్పట్లో జాతీయ రాజకీయాలను ప్రస్తావించే పరిస్థితి లేదు. ఇలాంటి అవకాశం ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రమే ఉంది. ఎందుకంటే, ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ముప్పు కనిపించడం లేదు. 119 అసెంబ్లీ నియోజక వర్గాలున్నా తెలంగాణలో బిజెపికున్న బలం అత్తెసరు మాత్రమే. ఇప్పట్లో బిజెపి తెలంగాణలో పుంజుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రయత్నాలు అంతంత మాత్రమే. అందువల్ల దేశంలో ఏ నాయకుడికి రాని ఒక అరుదైన అవకాశం పవర్‌లో ఉండగానే కెసిఆర్‌కు వచ్చింది. ఆయన పార్టీ పవర్ లో ఉన్నపుడే టిఆర్‌ఎస్‌లో ఉన్న ముఖ్యులకు యుద్ధ విద్యలన్నీ నేర్పించారు. తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని ఊరూరా పది మంది కెసిఆర్‌లు బిజెపికి వ్యతిరేకంగా అనర్గళంగా మాట్లాడగలరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News