Thursday, January 16, 2025

బిఆర్‌ఎస్ కాదు…’బి’ఆర్‌ఎస్‌ఎస్

- Advertisement -
- Advertisement -

 ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తున్న బిఆర్‌ఎస్ ఆర్‌ఎస్‌ఎస్‌తో మాది సిద్ధాంతపరమైన
వైరుధ్యం స్వాతంత్య్రం కోసం అది ఏనాడూ పోరాటం చేయలేదు కాంగ్రెస్
నాయకులు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తెచ్చారు 140 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కు
సొంత కార్యాలయ భవనం 40 ఏళ్ల కింద పుట్టిన బిజెపికీ, ఇతర ప్రాంతీయ
పార్టీలకు సొంత భవనాలున్నాయి ఇదే కాంగ్రెస్ నిస్వార్ధ సేవకు నిదర్శనం
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అనేది బిఆర్‌ఎస్‌ఎస్ అని, ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిజెపి చేసే ఆరోపణలనే తెలంగాణలో బిఆర్‌ఎస్ అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు.

(ఐడియాలాజికల్ డిఫరెన్సెస్) స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అది అని, మోహన్ భాగవత్ (ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్) అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని సిఎం వివరించారు.

మోహన్ భగవత్‌పై మోడీ చర్యలు తీసుకుంటారా లేదా…?

స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిజెపి వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టఅని, అందుకే తాము భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని సిఎం అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోహన్ భగవత్ ఉన్నారా లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా అన్నది స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విషయంలో మోహన్ భగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోహన్ భగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సిఎం డిమాండ్ చేశారు.

బిఆర్‌ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు

బిఆర్‌ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సిఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బిఆర్‌ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిఎం పేర్కొన్నారు.

దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక ఏఐసిసి నూతన కార్యాలయం

ఏఐసిసి నూతన కార్యాలయం దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏఐసిసి నూతన కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని కాంగ్రెస్ నిర్మించుకుందన్నారు. ఈ కార్యాలయం నుంచే దేశాన్ని బలమైన, శక్తిమంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తుందన్నారు. కాంగ్రెస్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ద్వారా దేశానికి రాజ్యాంగాన్ని అందించిందన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పేద ప్రజలు.. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతోం దని సిఎం తెలిపారు. 140 సంవత్సరాల కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకుందన్నారు.

ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపించిన కాంగ్రెస్ ఎంత నిస్వార్థంగా ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ఆర్థిక స్థితిగతులను, 40 ఏళ్ల భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నూతన కార్యాలయం నుంచే దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్ధంలో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికలు రూపొందుతాయని సిఎం తెలిపారు. కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభించుకున్న రోజు దేశ ప్రజలకు పండగ రోజని, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్న రోజని సిఎం అన్నారు.

కాంగ్రెస్‌కు బిజెపి అదే తేడా

140 ఏళ్ల చరిత్ర కలిగి కాంగ్రెస్ తన సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందని, అదే నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు 40 ఏళ్ల సీనియార్టీ మాత్రమే ఉన్న బిజెపిలు స్వల్పకాలంలోనే తమ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్ధంగా పని చేస్తుందో దీనిని బట్టే అర్థం చేసుకోవాలని సిఎం అన్నారు. బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు, కాంగ్రెస్ ఆర్థిక స్థితిగతి ఎలా ఉందో గమనించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే దేశాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు, ప్రణాళికలు రచించబడతాయని సిఎం అన్నారు.

ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు

దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వెళ్లారు.దేశ రాజధాని ఢిల్లీలో 9ఏ కోట్లా రోడ్డులో నిర్మించిన ఏఐసిసి నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రారంభించగా, ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. అంతకుముందు అక్భర్‌రోడ్డులో ఏఐసిసి ఆఫీసు ఉండగా ప్రస్తుతం 46 ఏళ్ల తరువాత పార్టీ అడ్రస్ మారింది. ఈ భవనాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది.

ఈ నేపథ్యంలో పెద్దఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీకి వచ్చారు. ఎపి పిసిసిఇ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌తో ఆమె భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాగా, రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News