Monday, December 23, 2024

సింహాలై గర్జిద్దాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మనదేశంలో మార్పు రావాల్సిందేనని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికే బిఆర్‌ఎస్ వచ్చిందని స్పష్టం చేశారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందడం లేదని చెప్పారు. నీరు అందించని పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలోని జబిందా మైదానంలో సోమవారం జగిరిన బిఆర్‌ఎస్ బహిరంగ సభకు సిఎం కెసిఆర్ హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు నివాళులర్పించారు. అనంతరం పార్టీలో పలువురు చేరగా.. గులాబీ కండువాలు కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. మాజీ ఎంఎల్‌ఎ అభయ్ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసగించారు. ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని అన్నారు. బిఆర్‌ఎస్‌కు ఒక లక్ష్యం ఉందని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు..?

గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా…? అని ప్రశ్నించారు. దేశం పురోగమిస్తోందా.. తిరోగమిస్తోందా…? ఆలోచించాలని కోరారు. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు… ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని చెప్పారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతోందని, ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా.. చెప్పండి అంటూ సభికులను అడిగారు. నా మాటలు విని ఇక్కడే మర్చిపోకండి…నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి… మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా..? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రజలకు సాగునీరు, తాగునీరుసరిగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది..? ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు అని అడిగారు. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా..?, పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా…? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా..?, ఇంటికి పంపాలా..? అని ప్రశ్నించారు. తాగడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరు…? అని ప్రశ్నించారు. దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ధైర్యంగా పోరాడితేనే పరిష్కారం

ఎంత త్వరగా మేలుకుంటే.. దేశం అంత త్వరగా బాగుపడుతుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలి..?, ఇంకెంతకాలం పరిష్కారం కోసం ఎదురు చూడాలి..? అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా..? అని అడిగారు. భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారని, ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదని, అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బిఆర్‌ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు. మార్పు వచ్చే వరకు బిఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే అని కెసిఆర్ పునరుద్ఘాటించారు.

బిఆర్‌ఎస్ విజయం తథ్యం

భారతదేశంలో నీటివనరులు సమృద్ధిగా ఉన్నాయని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గుర్తు చేశారు. సాగు యోగ్యత ఉన్న భూములకు నీటిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ.. ప్రధాని, రాష్ట్రాల సిఎంలకు ఆ పని చేసే సామర్ధ్యాలు లేవని విమర్శించారు. నిజాయితీగా బిఆర్‌ఎస్ చేస్తున్న పోరాటానికి విజయం తథ్యమని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణలో సాగునీరు, తాగునీరు సమస్య లేకుండా చేశామని, అదే రీతిలో మహారాష్ట్రను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతులకు అన్నీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బిఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంచండి… ఒక కులం, మతం, వర్గం కోసం బిఆర్‌ఎస్ ఆవిర్భవించలేదని తెలిపారు. నిజాయితీగా పోరాడతాం.. అంతిమ విజయం సాధిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇంటింటికీ తాగునీరు..

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోపు ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు… స్వతంత్ర భారతావనిలో తాగేందుకు నీరు లేదు.. యువతకు ఉద్యోగాలు లేవు… జనాభాకు కావాల్సిన దానికంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉందని వివరించారు. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయని తెలిపారు. సాగు యోగత్య ఉన్న భూములకు అందించాల్సి ఉందని, కానీ ప్రధాని, రాష్ట్రాల సిఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని విమర్శించారు.

ఉచిత విద్యుత్ పథకం అమలు చేయొచ్చు

తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేదని.. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 24 గంటలు సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ఇక్కడ అమలు చేయవచ్చని చెప్పారు. దేశంలో కొత్త లక్ష్యాలు.. సంకల్పంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే వనరులు ఉన్నాయని, దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని చెప్పారు. ఇది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సిఎం పదవిలో ఉండను అని కెసిఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, విద్యుత్ రంగాన్ని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కెసిఆర్ మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి ప్రభుత్వపరం చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. పాలనా సామర్థ్యం గల అధికారులు ఉన్నప్పటికీ.. తెలంగాణ తరహా పథకాలు ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చట్టాలు అవసరమని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.మహారాష్ట్రలో కచ్చితంగా విజయం సాధిస్తామని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మరాఠా నేలపైనే దళితులను పట్టించుకోరా..?

కెసిఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అంటున్నారని, తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకువస్తే నేనెందుకు వస్తా అని కెసిఆర్ అన్నారు. మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు అమలు చేయాలని చెప్పారు. 24 గంటల కరెంట్ ఇవ్వండి… రైతుబంధు, రైతుబీమా కల్పించండి అని పేర్కొన్నారు. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు తాను రానేరానని అన్నారు. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..?, దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు..? అని ప్రశ్నించారు. పాలనా సామర్థ్యం గల అధికారులు ఉన్నప్పటికీ.. తెలంగాణ తరహా పథకాలు ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదని అడిగారు. నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా అంటారు… కానీ నగరంలో వీధి వీధికో చైనా బజార్ ఉంటదని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా మజాక్, మేకిన్ ఇండియా జోక్ అయ్యాయని విమర్శించారు.

మహారాష్ట్ర మంత్రులు, కేబినెట్ మంత్రులుంటారు…కానీ చీఫ్ సెక్రెటరీ ఎందుకు ఉండరు..? అని నిలదీశారు. పెద్ద రాష్ట్రమని చెప్పుకునే మహారాష్ట్రలో చీఫ్ సెక్రెటరీ ఉండరా..? అని ధ్వజమెత్తారు. ‘మహారాష్ట్రస్థానిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సత్తా చూపించాలని అన్నారు. మహారాష్ట్రలో రాబోయే జెడ్‌పి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని అని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు… మన ఓటే సమ సమస్యకు పరిష్కారమని తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరేయాలని, దాంతో ఇక్కడి పాలకులు కచ్చితంగా దిగి వస్తారు.. మీ సమస్యలు తీరుతాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించండి… ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారం కావో చూస్తా అని చెప్పారు. ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తనదే అని కెసిఆర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు… రైతులంతా ఐక్యంగా కదిలి మీ రాజ్యం తెచ్చుకోవాలి…బిఆర్‌ఎస్ సర్కారును తీసుకురండి…మీ సమస్యలు నేనే తీరుస్తా అని కెసిఆర్ చెప్పారు. రైతురాజ్యం తీసుకురావడమే బిఆర్‌ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. మీ అస్త్రం ఓటుగా మారాలి… మీ లక్ష్యం కిసాన్ సర్కార్ కావాలి అని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

దేశంలో ఇప్పటికీ రైతులు కష్టాలు తీరలేదు

భారతదేశం నెహ్రూ హయాంలో కాస్తోకూస్తో అభివృద్ధి జరిగిందని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. మనకంటే చాలా చిన్న దేశాల్లో అద్భుతమైన రిజర్వాయర్లు ఉన్నాయని తెలిపారు. జింబాబ్వే వంటి చిన్న దేశాల్లో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి…రైతులు ఆలోచన చేయాలని…ఐక్యంగా ఉండాలని కోరారు. రైతు చట్టాలపై 13 నెలలు రైతులు ఆందోళన చేసినా కేంద్రం చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో 770 మంది రైతులు చనిపోవడం ప్రజాస్వామ్యమా..? అని ప్రశ్నించారు. సాగు చట్టాలపై ప్రధాని మోడీ సారి చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దేశంలో ఇప్పటికీ రైతులు కష్టాలు మాత్రం తీరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా ఉన్న దేశం మనది… అయినా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నామని అన్నారు. లక్ష్యం లేని దిశగా దేశం పయనిస్తోందని వాపోయారు.

దేశంలో పెను విప్లవం వస్తేనే అభివృద్ధి సాధ్యం

దేశంలో ఎన్నో పార్టీలు మారాయి.. ప్రజలు బతుకులు మాత్రం మారలేదని కెసిఆర్ అన్నారు. దేశంలో పెను విప్లవం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికే బిఆర్‌ఎస్ పార్టీని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. బిజెపి కుట్రలకు భయపడితే ఏ పార్టీకీ కూడా మనుగడ ఉండదని అన్నారు. నిజాయితీతో మేం చేసే పోరాటానికి తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పారు. త్వరలో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ కార్యాలయం నిర్మిస్తామని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు తేవాల్సిందే… లేదంటే దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులే కొనసాగుతాయని సిఎం కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News