బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షుడు డాక్టర్ తోట
హైదరాబాద్: రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక పాత్ర పోషించనుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌తో కలిసి తోట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రత్యేకత సంతరించుకుందన్నారు.
యావత్ దేశ ప్రజలు తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి చర్చించుకుంటున్నారన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో విస్తరింపజేయాలన్న ధ్యేయంతో బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కెసిఆర్ నాగ్ పూర్‌లో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సిఎం కెసిఆర్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సుధీర్ఘకాలం పాటు పనిచేసి, ప్రజల మన్ననలు పొందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, బిఆర్‌ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ సేవలు మహారాష్ట్రలో కూడా వినియోగించికోవాలని సిఎం కెసిఆర్ పార్టీ నేతలకు సూచించారు.