Saturday, December 28, 2024

సిబిఐ కస్టడీకి ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

14 వరకు కస్టడీ 15న హాజరు పరచాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన బిఆర్‌ఎస్ ఎం ఎల్‌సి కల్వకుంట్ల కవితను ఇడి కస్టడీ నుం చి సిబిఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిబిఐ లోతుగా విచారించేందుకు ఐదు రోజులు కస్టడీ కోరుతూ గురు వారం కోర్టులో పిటిష న్ దాఖలు చేసింది. అందులో భాగంగా కవితను శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లో సిబిఐ హాజరుపరిచింది. అప్రూవర్ల వాం గ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందు కు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి 15న ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో అధికారులు కవితను సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు కోర్టులో వాదనలు వినిపించిన సిబిఐ తరఫు న్యాయ వాది మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని వెల్లడించారు. విజయ్ నాయర్, తదితరులతో కలిసి పథకం రూపొందించారన్నారు.

అందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిగాయని తెలిపారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టంగా ఉందని వెల్లడించారు. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారన్నారు. కవిత సూచనతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 కోట్లు అందజేశారని ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించారని స్పష్టపర్చారు. అందుకు కవిత వాట్సాప్ చాట్ సంభాషణలు ఈ విషయాలు ధ్రువీకరించాయని సిబిఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. సంభాషణలను కోర్టుకు అందజేసినట్లు తెలి పారు. మద్యం కేసులో కవిత పిఎ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ఇచ్చారని, అభిషేక్ సూచనతో ఆప్ నేతలకు డబ్బు ఇచ్చినట్లు అశోక్ తెలిపాడని కోర్టుకు తెలిపారు. అలాగే కవితకు ఇండో స్పిరిట్స్‌లో 33 శాతం వాటా ఉన్నట్లు బుచ్చిబాబు చెప్పారని కోర్టుకు వివరణ ఇచ్చారు.

ఈ విషయా లన్నీ ఇప్పటికే ఛార్జిషీట్‌లో సిబిఐ దఖలు చేసింది. తగిన ఆధారాలు కూడా అందుకు జతపరిచినట్లు సిబిఐ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. సౌత్ గ్రూప్‌నకు చెందిన ఒక వ్యాపారవేత్త సిఎం కేజ్రీవాల్‌ను కలిశారని సిబిఐ కోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి పూర్తిగా సహకరిస్తానని కేజ్రీవాల్ ఆయనకు హామీ ఇచ్చారని వివరించింది. మద్యం వ్యాపారులను సిఎం కేజ్రీవాల్‌కు కలిపిందే కవిత అని సిబిఐ వాదన లు సాగించింది. మొత్తం కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అయినందున ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉందని వెల్లడిం చింది. కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేసినట్లు సిబిఐ స్పష్టపర్చింది. శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా ఒక్కో జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత వారిని డిమాండ్ చేశారని కోర్టుకు సిబిఐ వివరణ ఇచ్చింది. అంత మొత్తం ఇచ్చేం దుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో హైదరాబాద్‌లో తన వ్యాపారం సాగనివ్వనని శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించినట్లు సిబిఐ అధికా రులు వెల్లడించారు. కవిత విచారణకు సహకరించ లేదని, అందుకే కస్టడీకి అడుగుతున్నట్లు తెలిపింది.

కవిత పిటిషన్లు తోసిపుచ్చిన కోర్టు
అంతకు ముందు కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు దాఖ లు చేశారు. ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతోందని కవిత వెల్లడించారు. తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు. అయితే, సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమెను కస్టడీకి అనుమతించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఇడి అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు కోర్టు పొడిగించింది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటి షన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుతో కవితను సిబిఐ అధికారులు కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించనున్నారు.

కల్వకుంట్ల కవితకు వెసులుబాట్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కెటిఆర్, పిఎ శరత్‌చంద్రలకు అనుమతి లభించింది. వీరితో పాటు ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశానికి సైతం అనుమతి ఇచ్చింది. న్యాయ వాది, కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సిబిఐ అధికారులు అక్కడ లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది. కస్టడీలో ఉన్న సమయంలో కవితకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినేందుకు కోర్టు అనుమతిచ్చింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, పిల్లోను కూడా ఉపయోగించు కోవచ్చని వెల్లడించింది. కవిత చదువుకోడానికి ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్, ది నట్‌మెగ్స్ కర్స్, రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్ పుస్తకాలు అనుమతిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News