Friday, November 15, 2024

కోట్లు ఎగ్గొట్టి.. ఓట్లెట్ల అడుగుతరు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలపై పక్కా డేటా, చారిత్రక ఆధారాలతో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు స మాయత్తమైంది. విపక్షాల మోసపూరిత మాటలు, అక్కసుతో చేసే విమర్శలను తిప్పికొడుతూ కాం గ్రెస్, బిజెపి నేతల మాటలు వింటే అన్యాయమైపోతామని, చేజేతులా అభివృద్ధి- కార్యక్రమాలను కోల్పోవాల్సి వస్తుందని బిఆర్‌ఎస్ నేతలు రా ష్ట్ర ప్రజలకు కనువిప్పు కలిగే విధంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు తెలిపారు. దశాబ్దాల కరువుతో సహజీవనం చేసిన తెలంగాణ ప్రజలకు గడచిన పదేళ్లల్లో చేసి చూపించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓ వైపు ప్రజలకు గుర్తు చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీ లు తెలంగాణకు చేసిన అన్యాయం, ద్రోహాలను సాక్షాధారాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించాలని,

అవసరమైతే కరపత్రాలు, బుక్‌లెట్స్ విడుదల చేయాలని కూడా బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు యోచిస్తున్నారని ఆ నాయకులు వివరించారు. ఏకంగా ఆరు దశాబ్దాల దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణ వెనుకబాటు తనా న్ని పారద్రోలి అభివృద్ధి-, సంక్షేమం వైపు రాష్ట్రాన్ని నడిపించలేదని, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడ్డారనే అంశాలను చారిత్రక ఆధారాలతో సహా ప్రజలకు వివరించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్, బిజెపిలను ఎండగడుతూనే ఉన్నారని, మిగిలిన నాయకులను కూడా అదే తరహా ఎదురుదాడికి సన్నద్ధం చేస్తున్నట్లుగా ఆ నాయకులు వివరించారు. ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి రికార్డుస్థాయిలో ఒక లక్షా 35 వేల 812 కోట్ల రూపాయల నిధులను ఎగ్గొట్టిందని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలకు బిజెపి ప్రభు త్వం చేసిన ద్రోహంకాక మరేమిటని ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ బిజెపి నాయకులు తమ రాష్ట్రానికి జరిగిన భారీ ఆర్థిక నష్టాలపై ఎన్నడూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీనిగానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గానీ అడిగిన పాపానపోలేదని,
ఇప్పుడు ఏ మొహంపెట్టుకొని తెలంగాణ ప్రజలను ఓట్లడుగుతారనే అంశాలపై కమలం పార్టీ నేతలను నిలదీయాలని బిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. తెలంగాణకు జరిగిన ఆర్థ్ధిక నష్టాలను భర్తీ చేసిన తర్వాతనే ఓట్లు అడగాల్సి ఉండగా ఆ పనిచేయకుండా ఎన్నికల్లో గెలిపిస్తే అది చేస్తాం… ఇది చేస్తాం… అంటూ బిజెపి నేతలు మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం అయిదు సంవత్సరాల కాలానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలోతొక్కి 2019-20 నుంచి 2022-23వ సంవత్సరం వరకూ ఏకంగా మూడేళ్ల పాటు తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేసిందని, అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలెవ్వరూ కేంద్రాన్ని అడగలేదని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అంతేగాక కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించి బిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిని వ్యక్తంచేసినప్పటికీ

ఈ మూడేళ్లకుగానూ రూ.1,350 కోట్లను ఎలాంటి కారణం లేకుండానే నిలుపుదల చేశారని, దీనికి రాష్ట్ర బిజెపి నేతల దగ్గర సమాధానమే లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ కింద రూ.33 వేల కోట్లు ఇస్తున్నట్లుగా బిజెపి నేతలు చెప్పుకొంటున్నారని, ఇది పూర్తిగా అన్యాయమని ఎరువుల ఫ్యాక్టరీలకు సబ్సిడీలు ఇస్తూ ఆ నిధులను రైతులకు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం బిజెపి నేతలకే చెల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోవదడం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోవడం వంటివి కూడా ఎన్నికల ప్రచార సభల్లో చర్చకు వస్తాయని వివరించారు. ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినప్పటికీ తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయల పరిహారాలను మూడేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదు. బోరు బావుల మోటార్లకు విద్యుత్తు మీటర్లను బిగించాలనే నిబంధనపెట్టి అన్యాయంగా తెలంగాణకు రావాల్సిన 30 వేల కోట్ల రూపాయలను రాకుండా చేసిన ఘనత కూడా బిజెపి సర్కార్‌దేనని ఆ నాయకులు ధ్వజమెత్తారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను మార్చడం మూలంగా తెలంగాణకు ఏకంగా 15,330 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లో రాష్ట్రాల వాటాలను సక్రమంగా అమలుచేసినట్లయితే రాష్ట్రానికి మరో 33,712 కోట్ల రూపాయల నిధులు అదనంగా వచ్చి ఉండేవని ఆ నాయకులు వివరించారు. అంతేగాక రాజ్యాంగానికి లోబడి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నియమ, నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను కూడా నిలిపివేసిందని తెలిపారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.315 కోట్ల 32 లక్షలు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502 కోట్ల 61 లక్షలు కలిపి స్థానిక సంస్థలకు రూ.817 కోట్ల 61 లక్షల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.723 కోట్లను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో రూ.171 కోట్ల నిధులను ఇవ్వాల్సి ఉంది.

కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్థిక సంఘం రూ.3,024 కోట్ల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసింది. ఆ నిధులను కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో రూ.2,350 కోట్ల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇదిలావుండగా నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో రూ.5వేల కోట్ల నిధులను ఇవ్వాలని కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని వివరించారు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా రూ.1,35,812 కోట్ల నిధులను రాకుండా చేసిందని, ఎన్నిసార్లు తమ బకాయిల నిధులను విడుదల చేయాలని అడిగినప్పటికీ కనికరం లేని కేంద్ర సర్కార్ ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరించనున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News