Sunday, December 22, 2024

బిజెపి పాపాలే బిఆర్‌ఎస్‌కు వరాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) గడచిన పదేళ్లల్లో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని బిఆర్‌ఎస్ పార్టీ నేతలంటున్నారు. పేదలే కాకుండా ధనికులు సైతం బతకలేని పరిస్థితుల్లోకి బిజెపి నెట్టిందని, ఇలాంటి దుర్భర పరిస్థితులు రాకుండా ఉండాలంటే బిజెపి అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని బిఆర్‌ఎస్ నేతలు ప్రతి ఎన్నికల సభలోనూ ప్రజలకు పిలుపునివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో బిజెపికి ఘోరపరాభవంతో బుద్ధిచెప్పి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కుతో గట్టిగా గుణపా ఠం చెబుతారని బిజెపి అగ్రనేతలకు తెలిసి వచ్చేలా తీర్పు ను ఇవ్వాలని, లేకుంటే తెలంగాణకే కాకుండా యావత్తు భారతావనికే ఎంతో నష్టం వాటిల్లుతుందని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితులు దాపురిస్తాయనే కోణంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు వివరించారు.

2014 నవంబర్ నెలలో పెట్రోల్ లీటర్ ధర 65 రూపాయలుం టే నేడు 110 రూపాయల 27 పైసలుంది. డీజిల్ లీటర్ ధర నాడు 53 రూపాయల 35 పైసలుంటే, ప్రస్తుతం డీజిల్ లీటర్ ధర 105 రూపాయల65 పైసలుంది. ఇలా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆకాశాన్నంటే విధంగా పెంచడంతో రవాణా ఛార్జీలు అన్ని రంగాల్లోనూ భారీగా పెరిగాయి. పెరిగిన చార్జీలతో దేశ ప్రజలు నరకయాతనను అనుభవిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిన ప్ర భావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయని, అంతేగాక 2014లో వంటగ్యాస్ సిలిండ ర్ ధర కేవలం 480 రూపాయలుండగా నేడు 1200 రూపాయలకు బిజెపి ప్రభుత్వం పెంచిందని, దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు తారాస్థాయికి చేరడంతోనే ఇటీవలనే గ్యాస్ సిలిండర్ ధరలను దశలవారీగా తగ్గిస్తూ 950 రూపాయలకు చేర్చారని, ఇవే అంశాలను తెలంగాణ ప్రజలకు కూలంకషంగా వివరిస్తూ బిజెపి పాలనను ఎండగడతామని అంటున్నారు. పేద ప్రజలు, మధ్య తరగతి వర్గాలు సైతం ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా

తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గ్యాస్ సిలిండర్‌ను కేవలం 400 రూపాయలకు సరఫరా చేసేందుకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొన్నారని ఆ నాయకులు వివరించారు. అంతేగాక పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు, బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్కో సిలిండర్‌ను కేవలం 400 రూపాయలకే ఇచ్చే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టోను కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తామని ఆ నాయకులు ధీమాగా చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్‌పైన కుటుంబానికి ఏడాదికి 4,400 రూపాయలను సబ్సిడీగా ఇవ్వనున్నామని, ఈ హామీతో బిజెపి ఖేల్ ఖతం అవుతుందని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. అంతేగాక జిఎస్‌టి పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను దోచుకుంటోందని, రికార్డుస్థాయిలో ఏటా సగటును 18 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంతటి భారీస్థాయిలో పన్నులు లేవని, కేవలం మన దేశంలోనే ఇంతటి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నారనే అంశాలను కూడా జనానికి వివరిస్తామని అంటున్నారు.

జిఎస్‌టినే కాకుండా సెస్, సర్‌చార్జీల తదితర తొమ్మిదిరకాల పన్నులతో పేదల దగ్గర్నుంచి మధ్యతరగతి, ధనికులు, చివరకు బిలియనీర్లు కూడా ఈ పన్నుల దోపిడీని తట్టుకోలేక, కేంద్రం వేధింపులను భరించలేక మన దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని దేశం వదిలిపారిపోతున్నారని, అలా ప్రధాని నరేంద్రమోడీ హయాంలోనే ఏకంగా 2.80 లక్షల మంది బిలియనీర్లు దేశం వదిలిపారిపోయారని వివరించారు. ఇక పేదలు, మధ్యతరగతి, కొద్దిపాటి ధనికులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక, ఇతర దేశాలకు పారిపోవడం తెలియక ఇక్కడే చస్తూ బ్రతుకుతున్నారని, ఈ అంశాలను కూడా ఎన్నికల సభల్లో ప్రజలకు వివరిస్తామని అంటున్నారు. దేశాన్ని పాలించడమంటేనే ఎడాపెడా పన్నులు వేస్తూ దేశ ప్రజల రకాన్ని పీల్చడమేనా అన్నట్లుగా సాగుతున్న బిజెపి పాలనను ఎండగడుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 1.60 లక్షల కోట్ల రూపాయలను ఆదాయాన్ని ఇస్తుండగా అందులో కనీసం న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా నిధులు సుమారు 72 వేల కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ

తప్పుడు విధానాల మూలంగా కేవలం 45 వేల కోట్లు మాత్రమే వచ్చాయని, బిజెపి పాలన మూలంగా తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా సుమారు 27 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, అంతేగాక ఇలా తెలంగాణ ప్రజల నుంచి దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నింటినీ అదానీ, అంబానీలకు లోన్లు రూపంలో ఇవ్వడం, వారు తీసుకొన్న లోన్లను ఎగ్గొట్టడం వంటివి జరుగుతున్నాయనే అంశాలను ఎన్నికల సభల్లో ప్రజలకు వివరిస్తామని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు వివరించారు. ఎటొచ్చీ తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీ నాయకుల బండారాన్ని బయటపెడతామని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు బిజెపిపైన ఆగ్రహావేశాలతో ఉన్నారని అంటున్నారు. బిజేపి వైఫల్యాలు తప్పకుండా బిఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా, ఓటింగ్ పరంగా చూసినా తమకు ప్రయోజనకరంగానే పరిస్థితులు ఉన్నాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News