నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల వేళ మునుగోడు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వడంతో ఆయన వైఖరి తట్టుకోలేక ప్రజాప్రతినిధులు అంతా కారు దిగుతున్నారు. మూకుమ్మడిగా బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. ఒక్కసారే నియోజకవర్గ ప్రజాప్రతినిధులంతా పార్టీకి గుడ్‌బై చెప్పడం గులాబీపార్టీకి పెద్దదెబ్బగానే చెప్పవచ్చు. గత కొంతకాలంగా మునుగోడు నియోజకవర్గంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బట్టబయలు అయింది. ఈ పరిణామాలు గులాబీ పార్టీ నేతలకు మింగుడుపడటంలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్‌నగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీ నుండి చేజారిపోయారు.
ఇప్పుడు మునుగోడు ముసలం పుట్టి బయటకు వెళుతుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. అయితే మునుగోడు నియోజక వర్గంలోని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, నాంపల్లి జడ్‌పిటిసి ఏలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, మునుగోడు జడ్‌పిటిసి నారబోయిన స్వరూపరవి ముదిరాజ్, నారాయణపురం ఎంపిపి గుత్తా ఉమా ప్రేమేందర్‌రెడ్డి, నాంపల్లి, మునుగోడు వైస్‌ఎంపిపిలు పానుగంటి రజినివెంకన్నగౌడ్, అనంత వీణాలింగస్వామిగౌడ్‌లు కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మంతనాలు జరిపి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైఖరి నచ్చకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఇవన్నీ ఇలాఉంటే బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగనుంది. కమలం పార్టీలోకి రాజగోపాల్‌రెడ్డితో వెళ్ళిన కేడర్ అంతా ఘర్ వాపసీ అన్నట్లుగా తిరిగి స్వంత గూటికి చేరుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు చేరిపోగా మరికొందరు ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చేటప్పుడు చేరడం లేదంటే మునుగోడు క్యాంపు కార్యాలయంలో పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఏదిఏమైనా మునుగోడు బిఆర్‌ఎస్ పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పవచ్చు. ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేరికలతో మరింత పుంజుకుంటుందని అంటున్నారు.