Wednesday, January 22, 2025

దద్ధరిల్లిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

కవిత మద్ధతుగా ఢిల్లీకి చేరుకున్న బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు
పలుచోట్ల బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు
ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులతో భయపెడుతున్నారు…
మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదు
ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ
కవితకు మంత్రులు, ఎంపిల మద్ధతు
హైదరాబాద్: బిజెపి పార్టీకి, ఈడీకి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట, తెలంగాణ భవన్ వద్దకు బిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకొని ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా బిజెపి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు బిజెపి దిష్టి బొమ్మను దహనం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఢిల్లీకి భారీగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పలువురు మంత్రులు సైతం ఆమెకు మద్ధతు తెలిపారు. అందులో భాగంగా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు.
కవితకు మద్ధతుగా ఢిల్లీలో సమావేశం
ఈ సందర్భంగా మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు కవితకు మద్ధతుగా శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధాని మోడీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు విరుచుకుపడ్డారు. సిఎం కెసిఆర్ లాంటి నాయకుడిని ఎదుర్కొనలేక ఈడీ, సిబిఐ, ఐటీలను ముందుపెట్టి భయపెట్టాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఆరోపించారు. ఈడీ, సీబిఐ కేసులకు భయపడమని వారు స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న భయంతోనే దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోడీ ఉసిగొల్పుతున్నారని వారు విమర్శించారు.
ఈడీ, సీబిఐ కేసులకు భయపడం
మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కెసిఆర్ పెంచారని వారు గుర్తు చేశారు. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళకు కట్టబెట్టారని వారు తెలిపారు. ఈడీ, సీబిఐ కేసులకు భయపడమని వారు పేర్కొన్నారు. ఎవరి మీద ఎందుకు కేసులు పెడుతున్నారో భారతదేశం మొత్తం గమనిస్తోందని వారు వివరించారు. ప్రతిపక్షాలపై మాత్రమే ఈడీ, సీబిఐ దాడులు జరుగుతాయని వారు ఆరోపించారు. బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వారు హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు స్పష్టం చేశారు.
దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి…
తన చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కెసిఆర్ వెన్నంటి ఉన్నవారిని వేధిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని వారు తెలిపారు. మహిళకు మేయర్ స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం తమదేనని వారు పేర్కొన్నారు. మహిళలకే మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌లు ఇచ్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని వారు వివరించారు.
సంక్షేమ కార్యక్రమాలు బండి సంజయ్‌కు కనిపించడం లేదా ?
సిఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బండి సంజయ్‌కు కనిపించటం లేదా అని వారు ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి ద్వారా ప్రభుత్వమే లక్ష రూపాయలు ఇస్తుందని వారు వివరించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. సొంత నిధులతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని వారు పేర్కొన్నారు. ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డలకు అండగా ఉన్నామని వారు గుర్తు చేశారు. మహిళలకు భద్రత కల్పించాలని షీటీమ్స్ ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు.
కవితమ్మా ధైర్యంగా ఉండండి: మంత్రి వేముల
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయని, అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు.
కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులా ? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కవితపై జరుగుతున్న ఈడీ దర్యాప్తును దేశం యావత్ గమనిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద కేసులు అవుతున్నాయో చూస్తున్నారన్నారు. బిజెపి వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని, వారు సచ్ఛీలురా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించకపోతే ఏ కేసులు ఉండవని ఆయన వివరించారు. కేవలం ప్రతిపక్ష నాయకులపై మాత్రమే ఎందుకు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News